కళ్లెం లేని బడులు

1 Jun, 2019 12:56 IST|Sakshi
ఫీజుల వివరాలు లేని నోటీస్‌బోర్డు

అమలుకాని ఫీజుల నియంత్రణ

పేపర్‌కే పరిమితమవుతున్న పట్టికలు

నోటీస్‌ బోర్డుల్లో కనిపించని వివరాలు

అధిక ఫీజుల నియంత్రణపై చర్యలు శూన్యం

కానరాని గవర్నింగ్‌ బాడీ మరో పదిõ రోజుల్లో

తెరవనున్న పాఠశాలలు

కడప ఎడ్యుకేషన్‌: పాఠశాల స్థాయిలో ఫీజుల నియంత్రణ చర్యలు అటకెక్కాయి. ఫీజు నియంత్రణ చట్టం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోకుండా పోతోంది. చట్టం తమ చుట్టం అన్నట్టుగా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలల యజమాన్యాలు అధిక ఫీజుల పేరుతో దోచుకుంటున్నాయి. ఫీజు పట్టికలు పేపర్‌కే పరిమితమయ్యాయి తప్ప నోటీస్‌ బోర్డుల్లో కనిపించడం లేదు. యాజమాన్యాలకు రాజకీయ, ధనబలం ఉండటంతో ఫీజు నియంత్రణఫై సంబంధిత విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేక చేతులెత్తేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.  అధిక ఫీజులు వసూలు చేస్తున్నా వీటిపైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడం పేద విద్యార్థులకు శాçపంగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి.

చట్టం ఏం చెబుతోంది..
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి విద్యనందించాలి. బడిబయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించి ఉచితంగా నిర్బంధ విద్యనందించాలి. ప్రభుత్వ పాఠశాలలల్లోనైతే ఉచితంగా చదువుతోపాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి సౌకార్యాలు అందిస్తున్నాయి. ఉన్నత చదువులైన ఇంజినీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సులకు ప్రభుత్వమే ఫీజులు నిర్ణయిస్తుంది. అయితే పాఠశాల స్థాయిలో ఫీజు నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అందినకాడికి దోచుకుంటున్నాయి. రకరకాలు పేర్లతో తల్లితండ్రులను బురడి కొట్టిస్తూ దండుకుంటున్నాయి. 

ఊసే లేని గవర్నింగ్‌ బాడీ
పాఠశాలలు ఏర్పాటు చేసేటప్పుడు కచ్చితంగా ట్రస్టు పేరు పెట్టి గుర్తింపు పొందుతారు. ఇలా ఏర్పాటైన పాఠశాలకు గవర్నంగ్‌ బాడీని ఏర్పాటు చేయాలి. ఈ బాడీలో ట్రస్టు చైర్మన్‌ , కరస్పాండెంట్, హెచ్‌ఎం, టీచర్, పేరెంట్‌తో గవర్నింగ్‌బాడీని నియమించి, ఫీజులు ఎంత వసూలు చేయాలి, ఉపాధ్యాయులకు జీతాలు ఎంత ఇవ్వాలి తదితర అంశాలను నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది ప్రతి పాఠశాలలో అమలు కావాలి. కానీ  ఎక్కడా అమలు అవుతున్న దాఖలాలు కనిపించటం లేదు. పేపర్లపై మాత్రమే గవర్నింగ్‌ బాడీని చూపించి మిగిలిన అన్ని పనులను యాజమాన్యం చక్కదిద్దుకుంటున్నాయి. 

కానరాని ఫీజు పట్టికలు
ప్రతి పాఠశాలలో తరగతి వారిగా ఫీజుల వివరాలకు సంబంధించిన వివరాలను  నోటీస్‌ బోర్డులో ఉంచాలి. అలాగే ఉపాధ్యాయుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. కానీ ఏ ఒక్క పాఠశాలలోనే ఈ పట్టికను ఏర్పాటు చేయలేదు. ఫీజు నియంత్రణ అధికారులదే అన్న భావన తల్లితండ్రుల్లో నెలకుంది. ఫలితంగా యాజామాన్యాలను ప్రశ్నించేవారే కరువయ్యారు. ఫీజుల నియంత్రణ విషయంలో అధికారులతోపాటు తల్లిదండ్రులు అడిగినప్పుడే వారిలో కొంతైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విద్యాసంవత్సరం ప్రారంభంనుంచైనా ఫీజుల పట్టికలను అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కొరుతున్నారు.

మరిన్ని వార్తలు