జాగా కావలెను

29 Sep, 2014 02:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అధికారిక అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని వచ్చేనెల 21వ తేదీన నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ నగరంలో నిర్వహించనున్నారు. అయితే, నగరంలో ఎక్కడా పోలీస్ అమరవీరుల స్తూపం లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్న అధికారులు తాత్కాలిక  స్తూపం ఏర్పాటుపై  మొగ్గుచూపి ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. దీంతోపాటు పోలీస్ బాస్ రంగంలోకి దిగి శాశ్వతంగా అమరవీరుల స్తూపం నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని  అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ బాధ్యతలను బెటాలియన్స్ అదనపు డీజీ గౌతమ్ సవాంగ్‌కు అప్పగించారు. దీంతో సవాంగ్ రెండు రోజుల క్రితం విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో పర్యటించారు. శాశ్వత స్తూపం ఏర్పాటుపై కసరత్తు సాగిస్తూనే విజయవాడలో తాత్కాలిక స్తూపం ఏర్పాటు చేయటానికి సన్నాహాలు మొదలుపెట్టారు. మరోవారం రోజుల వ్యవధిలో విజయవాడలో తాత్కాలిక స్తూపం నిర్మించే ప్రాంతాన్ని  ప్రకటించనున్నారు.
 
రాష్ట్ర విభజనకు ముందు వరకు రాష్ట్ర పోలీస్ అమరవీరుల  స్తూపం హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ఉండేది. దీంతో ప్రభుత్వం ఏటా అక్కడే అధికారిక కార్యక్రమాలు  నిర్వహించేది. ఆ కార్యక్రమాలకు  ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది.  నూతన ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడను రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది.

విభజన క్రమంలో గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్తూపం తెలంగాణ రాష్ట్ర కేటగిరీలోకి చేరిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అమరవీరులకు అసలు ప్రస్తుతానికి  స్తూపమే లేదు. ఇప్పటివరకు అంత సీరియస్‌గా పట్టించుకోని పోలీస్ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం తేదీ దగ్గర పడటంతో అధికారుల్లో పూర్తిస్థాయి కదలిక మొదలైంది.  

మంగళగిరి బెటాలియన్‌లో తొలుత శాశ్వత అమరవీరుల సంస్మరణ స్తూపం ఏర్పాటు, స్టేడియం నిర్మాణానికి  స్థల లభ్యత ఉందని గుర్తించారు. అయితే, అక్కడ బెటాలియన్ అమరవీరుల స్తూపం ఉండటంతో రాష్ట్ర  స్తూపం అక్కడ పెట్టడం సాధ్యంకాదని నిర్ణయించి విజయవాడ నగరంపై దృష్టి సారించారు. విజయవాడను ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు కాబట్టి రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఇక్కడే జరుగుతాయి.

ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా విజయవాడ నుంచి పాలన సాగిస్తానని ప్రకటించిన క్రమంలో విజయవాడలో శాశ్వత స్తూపం, స్టేడియం ఏర్పాటు కోసం స్థల సేకరణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బెటాలియన్స్ డీజీ గౌతమ్ సవాంగ్  విజయవాడలోని ఆంధ్రలయోల కళాశాల ప్రాంగణం, సిదార్థ కళాశాల సెంటర్,  ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  ఎదురుగా ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు.
 

మరిన్ని వార్తలు