వంగవీటి పేరును పరిశీలించాలి

5 May, 2018 06:59 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న సుంకర శ్రీనివాస్‌

విమానాశ్రయానికిగానీ, పశ్చిమకృష్ణాకు గానీ..

అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు డిమాండ్‌

గాంధీనగర్‌(విజయవాడ): గన్నవరం విమానాశ్రయానికిగానీ, పశ్చిమ కృష్ణాజిల్లాకు గానీ వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు (కబడ్డి శ్రీను) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌పేటలోని కాపునాడు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా ఎంతో కృషి చేశారన్నారు. అయన చేసిన సేవలకు గుర్తింపుగా గన్నవరం విమానాశ్రయానికి రంగా పేరు పెట్టి గౌరవించాలని డిమాండ్‌ చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావు, వంగవీటి మోహనరంగా  ఈ ముగ్గురు వ్యక్తులే రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. అటువంటి వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తాము అధికారంలోకి రాగానే కృష్ణాజిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతామని ప్రతిపక్షనేత జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేదలకు సేవచేసిన ఆయన పేరును జిల్లాకు పెడతామని ప్రకటించడం సరైన నిర్ణయం అన్నారు. సీఎం చంద్రబాబు చేయలేని పని జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తాననడం సంతోషకరమన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి కాపులను మోసం చేశారన్నారు. హడావిడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఆ విషయాన్ని మరుగున పడేశారన్నారు. కాపులు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపులను చంద్రబాబు అనేక  కష్టనష్టాలకు గురి చేశారన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు వంగవీటి రంగా పేరును చంద్రబాబు ప్రభుత్వం పెడుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. 2019లో జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే తమ ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు. జగన్‌పై తమకు అపారనమ్మకం ఉందన్నారు.

రంగా పేరు పెడితే ఆయనను అభిమానించే ఎస్సీ,  ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలబడతారన్నారు. సమావేశంలో కాపునాడు నాయకులు జి.పానక్‌దేవ్, ఒగ్గు విక్కి, తాడికొండ విజయలక్ష్మి, రాంబాబు, రామ్మోహన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు