నా నియోజకవర్గంలోకి రావద్దు: బుచ్చయ్య

27 Oct, 2014 12:57 IST|Sakshi

రాజమండ్రి : రాజమండ్రిలో ఇసుక వ్యవహారం టీడీపీ, బిజెపీల కార్యకర్తల మధ్య చిచ్చు రేపింది. దాంతో అర్బన్‌ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇసుక ర్యాంప్‌ను బుచ్చయ్య చౌదరి ప్రారంభించడాన్ని ఉల్లికోట మహిళా సంఘం సభ్యులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే  కుమారి టాకీస్ ఇసుక ర్యాంపు రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ప్రారంభించేందుకు వెంకటేశ్వర సొసైటీ ఏర్పాట్లు చేసింది.  అయితే ఈ విషయం తెలుసుకున్న సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఘటనా స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అర్బన్ ఏరియాలోని ర్యాంపు విషయంలో రూరల్ ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరువురి ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తన ఏరియాలో జరుగుతున్న వ్యవహారాల్లో అర్బన్ ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారంటూ బుచ్చయ్య బాహాటంగా విమర్శలకు దిగారు. తన నిమోజకవర్గంలోకి అడుగు పెట్టవద్దని బుచ్చయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకులను  హెచ్చరించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సేలతో పాటు కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదం పెరిగింది. ఒక దశలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు తోపులాటకు దిగారు.

కాగా టీడీపీ ఆవిర్భావం నుంచి రాజమండ్రి నగరంలో గోరంట్ల అనుబంధం కేడర్తో మమేకమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ఎన్నికల్లో సీట్ల సర్ధుబాట్లలో భాగంగా టీడీపీ రాజమండ్రి అర్బన్ సీటును బీజేపీకి కేటాయించింది. అధికారికంగా గోరంట్ల రూరల్‌ నియోజకవర్గానికి చెందడంతో నగర పార్టీ దేశం కేడర్‌ నగర ఎమ్మెల్యే ఆకులతో సయోధ్యగా లేదు. దాంతో  శాసన సభ్యులుగా ఎన్నికైన నాటి నుండి వారిద్దరి మధ్య ప్రోటోకాల్‌ విషయంలో చాలాసార్లు వివాదం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు