బొబ్బిలి టీడీపీలో ఆధిపత్యపోరు !

29 Jul, 2016 02:17 IST|Sakshi
బొబ్బిలి టీడీపీలో ఆధిపత్యపోరు !
తమ్ముళ్ల ఆదేశాలతో అధికారుల బెంబేలు
ఎవరికి వారే తామే ముఖ్యమంటూ హెచ్చరికలు
పార్కింగ్‌తో మొదలైన పోరుతో ఉద్రిక్తత
 
బొబ్బిలి :  ఒకరు సర్పంచ్‌... మరొకరు ఎంపీపీ కుమారుడు. ఒకరు ఉప్పు... మరొకరు నిప్పు. ఎవరికి వారే తామే ముఖ్యమంటూ ఆదేశాలు. ఒక పార్కింగ్‌ వివాదం చినికి చినికి గాలివానగా మారి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజాప్రతినిధిగా తనకే హక్కుందని సర్పంచ్‌ అంటే... అభివద్ధిపై సమీక్షించే హక్కు తనకుందంటూ ఎంపీపీ కుమారుడి వితండ వాదన. వీరి మధ్య నలిగిపోతున్న దిగువస్థాయి అధికారులు. ఇదీ బొబ్బిలిలో గురువారం చోటు చేసుకున్న సంఘటన.
 
సిబ్బంది బెంబేలు
‘ఎవడిని అడిగి బండి అడ్డంగా పెట్టాడు.. తీస్తాడా..? తియ్యడా...? అని ఒకరంటే పోర్టికోలో కారు పెట్టిందెవడు..? వాడేమైనా ప్రజాప్రతినిధా...? బండి తియ్యను...రేపు ట్రాక్టర్‌ అడ్డుపెడతాను ఏంచేస్తాడో చేసుకోమను..అని ఒకరు. ఉపాధి సిబ్బందితో ఎంపీపీ కుమారుడు సమావేశం ఏర్పాటుచేస్తే... కోన్‌కిస్కా గాడు సమావేశం పెడితే మీరెందుకు హాజరయ్యారు...? అని మరో తెలుగు తమ్ముడు ఇలా గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని అధికారులు సిబ్బంది భయపడిపోయారు. వివరాలిలా ఉన్నాయి... టీడీపీ నాయకుడు అల్లాడ భాస్కరరావు, ఇటీవల టీడీపీలో చేరిన రాజుల గ్రూపునకు చెందిన ఎంపీపీ కుమారుడు శ్రీనివాసరావు వర్గం పరోక్షపోరుకు ఎంపీడీఓ కార్యాలయం గురువారం వేదికయ్యింది.  

పారాది సర్పంచ్‌ అల్లాడ భాస్కరరావు గురువారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయానికి ద్విచక్రవాహనంపై వచ్చి పోర్టికోలో నిలిపారు. కాసేపటికి ఎంపీపీ గోర్జ వెంకటమ్మ కుమారుడు శ్రీనివాసరావు తనకారుతో ఎంపీడీఓ కార్యాలయం పోర్టికోకు వచ్చి... ద్విచక్రవాహనం అడ్డంగా ఉంది ఎవడు పెట్టాడు...?కారు ఎలా ఉంచాలి..? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే సూపరింటెండెంట్‌ త్రినాథను పిలిచి ద్విచక్రవాహనం తీయమని చెప్పాలని ఆదేశించారు. ఎంపీడీఓ గదిలో ఉన్న భాస్కరరావుకు ఆ విషయం త్రినాథ తెలపగా ఎవడు తీయమంది..? పోర్టికోలో కారు ఎవడైనా పెడతాడా...? వాడేమైనా ప్రజాప్రతినిధా..? తీయను రేపు ట్రాక్టర్‌ అడ్డుపెడతాను ఏం చేస్తాడో చేసుకోమను అని తిరిగి సమాధానమిచ్చారు.
 
 
మరో సీన్‌లో...
ఎంపీపీ గదిలో శ్రీనివాసరావు ఉపాధి ఏపీఓ సుశీల, ఈసీ సంపతి, టీఏలతో శుక్రవారం జరగాల్సిన వనం మనంపై సమావేశం నిర్వహించారు. ఏపీడీ సాయిబాబా వచ్చి ఆ గదిలోనే శ్రీనివాసరావు సమక్షంలోనే సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ భాస్కరరావు ఉపాధి సిబ్బందికి ఫోన్‌చేసి అనధికార వ్యక్తి సమావేశంపెడితే ఎలా వెళ్లారు..? మీరు రండి మాట్లాడాలి అని పిలిచారు. సుమారు రెండున్నర గంటల సమావేశం అనంతరం ఉపాధి సిబ్బంది శ్రీనివాసరావు వద్దనుండి భాస్కరరావు వద్దకు వెళ్లారు. ఇక ఆగ్రహంతో ఆయన అనధికార వ్యక్తి సమావేశానికి పిలిస్తే మీరెందుకు వెళ్లారు..? అంటూ నిలదీశారు. ఎంపీపీ పిలిస్తే వెళ్లండి..అధికారులు పిలిస్తే వెళ్లండి. మీకేమైనా సమావేశం అని నోట్‌ ఆర్డర్‌ వచ్చిందా...? మీ ఉన్నతాధికారులు వెళ్లమన్నారా...? ఏపీడీ అక్కడకు సమావేశానికి వెళ్లడమేమిటని మండిపడ్డారు. ఏపీఓ సుశీల వెళ్తే ఒక సమస్య... వెళ్లకపోతే మరో సమస్యనీ... తాము నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇరువర్గాల అనుచరుల మోహరింపు...
ఈ దశలో అక్కడ పరిస్థితి చేయిదాటుతోందని తెలుసుకున్న భాస్కరరావు వర్గానికి చెందిన టీడీపీ నాయకులు చింతల భాస్కరరావు, చొక్కాపు నారాయణరావు, కునుకు సత్యనారాయణ, రెడ్డిమోహనరావు, మీసాలశ్రీనివాసరావు, గోర్జశ్రీనివాసరావుకు చెందిన చింతాడ జయప్రదీప్, గొర్లె ఈశ్వర ప్రసాద్, బంకురు బాబూరావు తదితర రెండు వర్గాల అనుచరులు అక్కడ మోహరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కలిగింది. ఎంపీడీఓ చంద్రమ్మ మాత్రం కార్యాలయానికి రాలేదు. చివరకు రెండు వర్గాల వారు ఎవరిమట్టుకు వాళ్లు వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
ఫిర్యాదు చేస్తా...
అనధికారికంగా సమావేశాలు నిర్వహిస్తే సహించం. దీనిపై ఉన్నతాధికారులకు, పార్టీ నాయకులకు ఫిర్యాదు చేస్తానని దీనిపై అమీతుమీ తేల్చుకుంటానని తెగేసి చెప్పారు. మొత్తమ్మీద పాత టీడీపీ నాయకులకు, తాజాగా వెళ్లిన వారికి మధ్య సయోధ్య కుదరలేదనీ... ఉప్పునిప్పులా కాలుదువ్వుతున్నారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
 
మరిన్ని వార్తలు