ఎమ్మెల్యే అవినీతిపై యుద్ధం

9 Oct, 2017 03:11 IST|Sakshi
టీచర్‌ శివకుమారి , శ్రీనివాసమూర్తి

 సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రచారం

అనుచరులతో ఎమ్మెల్యే బెదిరింపులు

ఉద్యోగానికి రాజీనామా చేసిన టీచర్‌

దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్లాపుర తాలూకాకు చెందిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ ప్రజాప్రతినిధిపై పోరాటానికి దిగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దొడ్డబళ్లాపుర జేడీఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అవినీతికి పాల్పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె తూర్పారబడుతున్నారు. తాలూకాలోని నెలమంగలలో ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా పనిచేస్తున్న శివకుమారి కొన్నిరోజుల క్రితం ప్రాథమిక విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి, తాలూకాలో ఎమ్మెల్యే దౌర్జన్యాలు ఇవీ అంటూ సవివరంగా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు.

ఇది ఎమ్మెల్యేకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన అనుచరుల ద్వారా సదరు టీచర్‌ను హెచ్చరించారు. అయినా, వెనకడుగు వెయ్యని శివకుమారి పోస్టుల యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. దీంతో ఎమ్మెల్యే నేరుగా ఆమె సోదరుడు రాజుకు ఫోన్‌చేసి బెదిరించినట్లు సమాచారం.

ఎమ్మెల్యేపై పోరాటం ఆపను
ఈ నేపథ్యంలో శివకుమారి మీడియాతో మాట్లాడుతూ.. తన ఉద్యోగానికి రాజీనామా చేశానని, ఎమ్మెల్యేపై తన పోరాటాన్ని ఆపబోనని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ, తాను పోటీచేయడం కానీ చేస్తానని చెప్పారు. కాగా, శివకుమారి అధికార కాంగ్రెస్‌కు మద్దతుగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు