ఎన్నాళ్లీ యాతన..!

7 Feb, 2019 08:12 IST|Sakshi
దాసన్నపేటకు చెందిన రోగిని వీల్‌చైర్‌పై తీసుకెళ్తున్న బంధువు

కేంద్రాస్పత్రిలో సమస్యల హోరు

రోగులు నడవలేని స్థితిలో ఉన్నా పట్టించుకోని సిబ్బంది

రోగి బంధువులే వార్డు బాయ్‌లుగా మారాల్సిన దుస్థితి

విజయనగరం ఫోర్ట్‌: కేంద్రాస్పత్రికి వచ్చే రోగులకు సేవలు అందని ద్రాక్షగా మారాయి. సకాలంలో స్పందించేవారు లేకపోవడంతో ఆపదలో ఉన్న రోగులు, వారి బంధువులు ఆవేదన చెందుతున్నారు. కొన్నిసార్లు వార్డుబాయ్‌లుగా మారి రోగులను వార్డులు, ఎక్స్‌రే, స్కానింగ్‌ విభాగాలకు తీసుకెళ్తున్నారు. కళ్లముందే సేవలు అందకపోయినా పట్టించుకునే అధికారులే కరువయ్యారంటూ గగ్గోలు పెడుతున్నారు. అధికారులు రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని  చెప్పడం తప్ప చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని వాపోతున్నారు.

జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో రోగులు అధిక సంఖ్యలో వస్తారు. ఆస్పత్రికి అవుట్‌ పేషేంట్లు 800 నుంచి 1000 మంది వరకు వస్తారు. ఇన్‌పేషెంట్లు 150 నుంచి 160 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో కంటి, ఎముకల, పిల్లల, ఈఎన్‌టీ, దంత, జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్, చర్మ, గైనిక్, మానసిక సంబంధిత వ్యాధులకు వైద్య సేవలు అందిస్తారు. అయితే, సేవల్లో అసౌకర్యాలు ఉండడం రోగులకు ఆవేదన మిగుల్చుతోంది.

నడవలేకపోతే నరకమే....
ఆస్పత్రికి వచ్చే రోగులు నడవగలిగితే ఫర్వాలేదు. లేదంటే నరకం చూడాల్సిన పరిస్థితి. నడవలేని స్థితిలో ఉన్నాం తీసుకుని వెళ్లండని వైద్య సిబ్బందిని అడిగినా పట్టించుకునే వారే కరువయ్యారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నిత్యం జరుగుతున్న తంతే ఆరోపణలకు ఊతమిస్తుంది.

పునరావతం కాకుండా చూస్తాం
నడవలేని స్థితిలో ఉన్న రోగులను వీల్‌చైర్, లేదంటే స్ట్రెచ్చర్‌పై తరలించేలా చర్యలు తీసుకుంటాం. రోగి బంధువులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం.  
– కె.సీతారామరాజు,సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి

>
మరిన్ని వార్తలు