నైతిక విలువలు నేర్పని విద్య వృథా

6 Jan, 2014 01:16 IST|Sakshi

విజయవాడ,న్యూస్‌లైన్ :  విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేలా బోధన ఉండాలని, నైతిక విలువలు నేర్పని విద్య వృథా అని రాష్ర్ట మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కొలుసు పార్థసారథి  స్పష్టం చేశారు. విజయవాడ గుణదల బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాలలో మూడురోజు పాటు జరిగే 41వ జవహర్‌లాల్ నెహ్రూ రాష్ట్ర స్థాయి విద్యావైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన(సైన్స్ ఫెయిర్) ఆదివారం మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో మంత్రి ముఖాముఖి మాట్లాడారు.

విద్యా శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో దాదాపు 400 ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. 23 జిల్లాల నుంచి 800 మంది విద్యార్థులు, 400 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన కొన్ని ఎగ్జిబిట్లు అందరినీ ఆలోచింపజేశాయి. విద్యుత్ ఉత్పత్తిని నిలువ చేయడం, గృహోపకరణాలను షార్ట్ సర్క్యూట్ నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడే మోడ్రన్ ఇన్‌వెన్షన్ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మద్యం తాగి వాహనాలు నడిపేందుకు ప్రయత్నిస్తే సెల్ఫ్‌లాక్ అయ్యే ఇగ్నేషన్ ఇంటర్ లాక్ డివైజ్.. భవన నిర్మాణ సమయంలో అధిక బరువులను సునాయాసంగా ఎత్తేందుకు ఉపయోగపడే హైడ్రాలిక్ ఎక్సావేటర్.. వ్యర్థాల నుంచి పెట్రోలు తయారుచేసే క్లీన్ బర్నింగ్ బయో ఫ్యూయల్ ఫౌడర్ ఫ్రం వేస్ట్ బయోమాస్ నమూనాలు ఆకట్టుకున్నాయి.

పంటలను నాశనం చేసే పురుగులను నివారించేందుకు బయోలాజికల్ పెస్ట్ కంట్రోల్.. కంప్యూటర్ విధానం ద్వారా పంట పొలాలకు రక్షణ కల్పించే హైటెక్ ఫార్మింగ్.. ఉప్పునీరు, థోరియం రియాక్టర్‌ల ద్వారా విద్యుత్ తయారు చేసే ఎలక్ట్రిసిటీ ఇన్ ఫ్యూచర్ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి.  విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిలి రవి సభకు అధ్యక్షత వహించారు.

సెంట్రల్‌ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు,  ఎస్‌సీఈఆర్‌టీ డెరైక్టర్ జి.గోపాలరెడ్డి, పాఠశాలవిద్య ఆర్‌జేడీ ఎంఆర్ ప్రసన్న కుమార్, డీఈవో దేవానందరెడ్డి, బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.మెలకియార్, కరస్పాండెంట్ పాదర్ జోసెఫ్ వెంపనీ, ఉప విద్యాశాఖాధికారులు ప్రభాకర్,జి.వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఎంవీ కృష్ణారెడ్డి, ఎం.జార్జిరాజ్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు