పరిశ్రమలకు వేగంగా నీటి కేటాయింపులు 

25 May, 2020 04:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి కేటాయింపులను పారదర్శకంగా, వేగంగా చేయడానికి జలవనరుల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఈ నేతృత్వం వహించే ఈ విభాగానికి రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఒక్కో ఎస్‌ఈని నియమించనుంది. పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతంలో నీటి కేటాయింపు కోసం ఆ ప్రాంత ఎస్‌ఈకి పారిశ్రామికవేత్త దరఖాస్తు చేసుకోవాలి. ఆ ప్రాంతంలో నీటి లభ్యత, పరిశ్రమ అవసరాలపై అధ్యయనం చేసి ఎస్‌ఈ ఆ విభాగం సీఈకి నివేదిక ఇస్తారు. ఈ నివేదికపై సీఈ మరోసారి అధ్యయనం చేసి జలవనరుల శాఖ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. దీనిపై సర్కార్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది. 

జాప్యం లేకుండా ఉండేందుకే.. 
► పారదర్శక పాలన, అపార ఖనిజ సంపద, సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పరిశ్రమల స్థాపనకు వివిధ రకాల అనుమతులను నిర్దేశించిన గడువులోగా ఇవ్వాలని సర్కార్‌ నిర్ణయించింది. 
► పరిశ్రమలకు అవసరమైన నీటి కేటాయింపుల కోసం ప్రస్తుతం ఆయా జిల్లాల సీఈలకు దరఖాస్తు చేసుకోవాలి. భారీ ఎత్తున చేపట్టిన ప్రాజెక్టుల పనుల పర్యవేక్షణ, ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం వంటి వాటి వల్ల సీఈలు, ఎస్‌ఈల పని భారం పెరిగింది. దాంతో పరిశ్రమలకు నీటి కేటాయింపుల కోసం చేసిన దరఖాస్తులపై గడువులోగా నివేదిక ఇవ్వలేకపోతున్నారు. ఇది పరిశ్రమల ఏర్పాటులో జాప్యానికి దారితీస్తోంది. 
► ఈ నేపథ్యంలోనే పరిశ్రమలకు నీటి కేటాయింపుల కోసం జలవనరుల శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.  

మరిన్ని వార్తలు