టీడీపీ పాపాలు.. తాగునీటికి శాపాలు

2 Sep, 2019 08:34 IST|Sakshi
టీడీపీ ప్రభుత్వ హయాంలో ట్యాంకు కట్టేందుకు ఏర్పాటు చేసి వదిలేసిన నిర్మాణం, చలమల్లో నుంచి తాగునీరు తెచ్చుకుంటున్న దృశ్యం

తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలు

ఫ్లోరైడ్‌ నీటితో కిడ్నీ వ్యాధులు

సాక్షి, అనుమసముద్రంపేట (నెల్లూరు): గత టీడీపీ ప్రభుత్వ పాలనలో తాగునీటి ఎద్దడి నెలకొన్న సమయంలో పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం గ్రామాలలో తాగునీటి సమస్య జఠిలమైంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు, అధికారులు తాగునీటి కోసం ట్యాంకులు కడుతున్నట్లు గ్రామాలలో హడావుడి చేశారు. కొద్దిగా పనులు ప్రారంభించిన అనంతరం వాటిని వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాధార పరిస్థితులు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో పాటు ఎక్కడా తాగేందుకు మంచినీరు దొరకడం లేదు. ఆత్మకూరు నియోజకవర్గంలోని పడకండ్ల, యర్రబల్లి, చేజర్ల మండలంలోని కొల్లపనాయుడుపల్లి, ఏఎస్‌పేట మండలంలోని పందిపాడు, జమ్మవరం, సీబీవరం, కాకర్లపాడు ప్రాంతాలలో తాగునీటి కోసం అలమటిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఎంజీఆర్‌ హెల్ప్‌లైన్‌ సమాచారం అందుకున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు.

కానీ ఏఎస్‌పేట మండలం జమ్మవరం పంచాయతీ కాకర్లపాడు గ్రామంలో తాగునీరు అందక నక్కలవాగులో చలమలు తీసి ఆ నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నారు. ఇదే గ్రామంలో నక్కలవాగు దాదాపు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మహిళలు సైతం అక్కడకు వెళ్లి నీరు తెచ్చుకునేవారు. ప్రస్తుతం అక్కడ కూడా నీరు లేకపోవడంతో గ్రామంలోని బోర్ల వద్ద ఫ్లోరైడ్‌ నీటిని తెచ్చుకుని తాగుతుండడంతో కొంత మందికి కిడ్నీ వ్యాధులు వస్తున్నట్లు ఇటీవల డాక్టర్లు సైతం నిర్థారించారు. గ్రామంలోని గిరిజన కుటుంబానికి చెందిన యాకసిరి పెంచలయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయి మంచంలో ఉన్నారు. కాకర్లపాడు గ్రామంలో దాదాపు 400 కుటుంబాలు ఉండగా దాదాపు 300 కుటుంబాల వారు మినరల్‌ వాటర్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. క్యాన్‌ రూ.10 వెచ్చించి ప్రతిరోజు ఇంటికి 3 క్యాన్లను వేసుకుంటున్నారు. ఈ విషయంపై గతంలో ఎన్నోసార్లు అధికారులకు తెలిపినప్పటికీ ఎవరూ స్పందించకపోవడం విశేషం. ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

ఆదుకుంటున్న ఎంజీఆర్‌ హెల్ప్‌లైన్‌
రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఏర్పాటుచేసిన ఎంజీఆర్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా అనేక గ్రామాలలో నీటి సమస్యలు తీరుస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాకర్లపాడు, జమ్మవరం గ్రామస్తులు తాము సైతం ఎంజీఆర్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడమే కాక ఆ గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు త్వరలో మేకపాటి గౌతమ్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి శాశ్వత మంచినీటి సౌకర్యం కలిగించేలా కోరనున్నట్లు సమాచారం.

మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేస్తున్నాం
రోజుకు మూడు నీటి క్యాన్లు కొనుగోలు చేస్తున్నాం. పనికి వెళ్లి వచ్చిన కూలి డబ్బులు నీటికే సరిపోతున్నాయి. బోరింగ్‌లో నీళ్లు తాగితే కాళ్లు, చేతులు నెప్పులు వస్తుండడంతో తాగడం మానేశాం.
– యాకసిరి కృష్ణమ్మ, గిరిజన కాలనీ

ట్యాంకు కడతామని చెప్పారు
2019 ఎన్నికలకు ముందు గ్రామంలో వాటర్‌ ట్యాంకు కడుతున్నామంటూ టీడీపీ వాళ్లు నిర్మాణం చేపట్టారు. అయితే ట్యాంకు పూర్తి కాకపోగా తాగునీటి సమస్య మాత్రం తీరలేదు. నక్కల వాగే దిక్కయింది. చలమలు లోడి తాగునీరు తెచ్చుకుని సేద తీరుతున్నాం. ఇప్పటి ప్రభుత్వమైనా స్పందించి శాశ్వత మంచినీటి పథకానికి దారి చూపాలి 
– తాళ్లూరు కొండయ్య, గిరిజనకాలనీ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు