వాటర్ గ్రిడ్ అసాధ్యమే!

14 Sep, 2014 00:48 IST|Sakshi
  • జిల్లాకు నీటి కష్టాలు తప్పవా?
  •  పోలవరం వస్తేనే 24  టీఎంసీల నీటికి అవకాశం
  •  తేల్చిన   నిపుణుల బృందం
  •  ప్రభుత్వానికి నివేదిక సిద్ధం
  • ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. జిల్లాలో గ్రిడ్ ఏర్పాటు అసాధ్యమని నిపుణులు తేల్చేశారు. పోలవరం వస్తేనే గాని అది సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తులో జిల్లాకు నీటి కష్టాలు తప్పేట్టు లేవు. పరిశ్రమలు, వ్యవసాయానికే కాకుండా తాగునీటికీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయి.
     
    విశాఖ రూరల్: జిల్లాకు నీటివనరుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కారణం రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే పడింది. మున్ముందు బహుళజాతి కంపెనీలు, ఐటీ, భారీ పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి. మానవ వనరులు కూడా విపరీతంగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో నీటి వినియోగం రెట్టింపు కానుంది. ఇప్పటికే అవసరాలకు తగ్గ నీటి సరఫరా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

    వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో ఉన్న పరిశ్రమలకు, తాగునీటికి రోజుకు 90 ఎంజీడీలు అవసరం. కానీ ఏలేరు, రైవాడ, మేహాద్రిగెడ్డ, గోస్తనీ, గోదావరి, ముడసర్లోవ, గంభీరం, తాటి పూడి జలాశయాల నుంచి రోజుకు 65 నుంచి 70 ఎంజీడీలు మాత్రమే వస్తోంది. దీంతో పరిశ్రమలకు నీటి కేటాయింపుల్లో కోత విధించాల్సి వస్తోంది. తాగునీటి సరఫరాను కూడా కొన్ని సందర్భాల్లో తగ్గించాల్సి వస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఉండనే ఉన్నాయి.
     
    వాటర్ గ్రిడ్ కష్టమే : ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వలను పెంచుకోడానికి గల అవకాశాలపై నివేదిక ఇవ్వాలని,  జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని నీటి సరఫరా విభాగం అధికారులు రెండు రోజుల క్రితం ఏర్పాటు నిర్వహించన సమావేశంలో తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం రుణమాఫీ తప్పించుకోడానికి, ప్రజల ఆలోచనలను మళ్లించడానికే రోజు కో ఆచరణ సాధ్యం కాని కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకువస్తోందన్న విమర్శలున్నాయి.
     
    పోలవరంతోనే గ్రిడ్ సాధ్యం : గోదావరి నుంచి గాని, ఒరిస్సా, శ్రీకాకుళం ఇతర ప్రాంతాల్లో ఉన్న నదుల నుంచి జిల్లాకు నీరు చేరే అవకాశం లేదు. దీంతో ఇక్కడ పడిన వర్షపు నీటినే జలాశయాల్లో నిల్వ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయానికే ఈ నీటి నిల్వలు సరిపోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే  వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యమని  అధికారులు తేల్చారు.

    పోలవరం ద్వారా జిల్లాలో తాగునీటి అవసరాలకు 24 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయి. దీంతో మిగిలిన జలాశయాల్లో నీటిని పరిశ్రమలు, సాగు అవసరాలకు వినియోగించుకొనే వీలు కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 5 నుంచి 7 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యం కాదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులు సమాయత్తమవుతున్నారు.
     

మరిన్ని వార్తలు