నీటి సమస్యకు పరిష్కారం.. వాటర్‌ గ్రిడ్‌

8 Aug, 2019 11:38 IST|Sakshi

సాగు, తాగునీరు, పరిశ్రమల అవసరాలకు ఏటా 10 టీఎంసీలు అవసరం

వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటే సమస్య పరిష్కారానికి మార్గంగా గుర్తింపు

జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో ఇటు ప్రజలు.. అటు రైతాంగం అల్లాడుతోంది. గత పాలకులు ముందు చూపు కొరవడి, ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయాయి. పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయలేని పరిస్థితి. శాశ్వతంగా నీటి సమస్యకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది. వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటే దీనికి పరిష్కార మార్గంగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ మేరకు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపింది. ఇది కార్యరూపం దాల్చితే జిల్లా వాసులకు నీటి కష్టాలకు చెక్‌ పెట్టినట్టే. 

సాక్షి , నెల్లూరు :  జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే ఏకైక రిజర్వారుగా సోమశిల ప్రాజెక్ట్‌ ఉంది. ఏటా ఈ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసి కండలేరు, కనిగిరి, తెలుగుగంగతో ఇతర ప్రధాన కాల్వలకు, జిల్లా తాగునీటి అవసరాలకు కేటాయిస్తున్నారు. కండలేరు ద్వారా తిరుపతికి, తెలుగుగంగ ద్వారా చెన్నై నగరాలకు నీటిని తరలిస్తున్నారు. జిల్లాలోని 46 మండలాల్లో ఐదేళ్లుగా కరువు వెంటాడుతూనే ఉంది. గతేడాది కూడా జిల్లాలో 26 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన క్రమంలో జిల్లాలో తాగునీటి అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించింది. రెండు నెలలుగా ట్యాంకర్ల ద్వారా కరువు మండలాల్లోని 436 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తోంది. సమీపంలో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని ట్యాంకర్లలో నింపుకొని సరఫరా చేస్తోంది. ఇందుకు సంబంధించి రైతుకు నెలకు రూ. 9 వేలు చెల్లిస్తోంది. మరో నెల రోజుల పాటు ట్యాంకర్లతో నీటి సరఫరా కొనసాగే అవకాశం ఉంది.

అడుగంటిన 70 శాతం బోర్లు
భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోయిన నేపథ్యంలో జిల్లాలోని 18,500 చేతి పంపుల్లో దాదాపు 70 శాతం నీరులేక నిరుపయోగంగా మారిపోయాయి. వర్షాకాలం వచ్చి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నా.. జిల్లాలో ఆశించిన మేరకు వర్షాలు కురవని పరిస్థితి. ఇదే తరహా ఇబ్బందులు ఏటా జిల్లాలో ఉంటున్నాయి. వీటి అన్నింటికి శాశ్వత పరిష్కారం చూపేలా గ్రామీణ రక్షిత మంచినీటి పథకాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టనుంది. ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు అధ్యక్షతన గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు, సోమశిల ప్రాజెక్ట్‌ అధికారులు, పశు సంవర్థక శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు సమావేశమయ్యారు.

జిల్లాలోని 46 మండలాలు, 7 మున్సిపాలిటీలు, నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని పరిశ్రమలకు, పశువులకు అవసరమైన నీటి వినియోగంపై అంచనాలు సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రతి ఇంటికీ తాగునీటి అవసరాలకు కోసం వాటర్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి, కనెక్షన్‌ ఇవ్వడానికి, దానికి అవసరమైన ఏర్పాట్ల నిర్వహణకు సుమారు రూ. 4,600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సోమశిల నుంచి తాగు, పరిశ్రమల నీటి అవసరాలకు 10 టీఎంసీలు ఏడాది పొడువునా అవసరం అవుతాయని గుర్తించారు. జిల్లాలోని అన్ని కెనాల్స్, బ్రాంచ్‌ కెనాల్స్‌కు సోమశిల నుంచి నీరు విడుదల కావాల్సి ఉండడంతో సోమశిల నీటి కేటాయింపులపై దృష్టి సారించి ప్రతి ఏటా పది టీఎంసీల వినియోగించుకోవడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఏటా సోమశిలకు వచ్చే ఇన్‌ఫ్లో, ఆవుట్‌ ఫ్లోను పరిశీలించి నీటి కేటాయింపులు జరపాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో పాటు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా రానున్న రెండేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఏర్పాటు చేయాలన్నదే వాటర్‌ గ్రిడ్‌ ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రతిపాదనలు పంపారు. 

తక్షణ అవసరాలపైనా దృష్టి
రానున్న ఆరు నెలల కాలంలో కనీనం ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కృష్ణా నది ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిసి సోమశిలకు నీరు చేరితే  రిజర్వాయర్‌ నుంచి నీటి సరఫరాకు ఇబ్బంది ఉండదు. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లిలకు కండలేరు ద్వారా, మిగిలిన నియోజకవర్గాల్లోని మండలాలకు సోమశిల ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనిని కొనసాగిస్తే డెడ్‌ స్టోరేజ్‌లో కూడా నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు.  

>
మరిన్ని వార్తలు