చెరువుల్లో తిమింగలాలు

19 Feb, 2017 02:37 IST|Sakshi
చెరువుల్లో తిమింగలాలు

రూ.400 కోట్లకు ‘టెండర్‌’
కర్నూలు జిల్లాలో 16 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ప్రణాళిక
4 రెట్లు అధికంగా రూ. 874 కోట్లతో ప్రతిపాదనలు
ఆర్థిక శాఖ అభ్యంతరం.. కీలక మంత్రి, సీఎం కన్నెర్రతో ఆమోద ముద్ర
నేడో రేపో.. జల వనరుల శాఖ పరిపాలన అనుమతి  
కమీషన్‌లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేలా రంగం సిద్ధం


సాక్షి, అమరావతి:  సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలకు పాల్పడి రూ.400 కోట్లు కొట్టేసి అపర కుబేరులుగా ఎదగడానికి ప్రభుత్వ ముఖ్య నేతలు రచించిన ప్రణాళిక అధికార వర్గాలను బిత్తరపోయేలా చేసింది. 16 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు నాలుగు రెట్లు అదనంగా రూ.874 కోట్లతో చిన్న నీటిపారుదల శాఖ పంపిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ నివ్వెరపోయింది. ప్రభుత్వ ముఖ్య నేత, మరో కీలక మంత్రి కన్నెర్ర చేయడంతో కిమ్మనకుండా అనుమతులు ఇవ్వడానికి సిద్ధమైంది. కర్నూలు జిల్లాలో హంద్రీ – నీవా సుజల స్రవంతి తొలి దశలో 80 వేల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు.

శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి హంద్రీ – నీవా ద్వారా మరో 2.74 టీఎంసీలను అదనంగా ఎత్తిపోసి పత్తికొండ నియోజకవర్గంలో 106 చెరువులను నింపి 16 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని ఓ కీలక మంత్రి ప్రతిపాదించారు. ఈ పథకాన్ని చేపట్టేందుకు డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) రూపొందించేందుకు రూ.90 లక్షలను కేటాయిస్తూ సర్కార్‌ గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన డీపీఆర్‌ మేరకు ఈ పథకాన్ని చేపట్టేందుకు రూ.874 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఆ మేరకు కర్నూలు జిల్లా చిన్న నీటి పారుదల విభాగం ఎస్‌ఈ జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనల మేరకు ప్రాజెక్టును చేపట్టేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఆర్థిక శాఖను జలవనరుల శాఖ కోరింది.

ఆర్థిక శాఖ అభ్యంతరాలపై కన్నెర్ర
జలవనరుల శాఖ పంపిన ప్రతిపాదనలపై సమగ్రంగా అధ్యయనం చేసిన ఆర్థిక శాఖ అధికారులు తాజా (2015–16) ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌)తో పోల్చి చూస్తే ఈ పథకం అంచనా వ్యయం నాలుగు రెట్లు అధికంగా ఉండటాన్ని గుర్తించారు. ఇంత డబ్బు ఎందుకు అవసరమవుతుందో వివరణ ఇవ్వాలని జలవనరుల శాఖకు ఆ ప్రతిపాదనలను తిప్పి పంపారు. ఇది తెలిసిన కీలక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినా ఆర్థిక శాఖ అధికారులు వెనక్కి తగ్గలేదు. ఈ వ్యవహారాన్ని కీలక మంత్రి సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తాము కష్టపడుతుంటే నిబంధనల పేరుతో అడ్డుపడతారా అంటూ ఆర్థిక శాఖపై సీఎం కన్నెర్ర చేశారు. దీంతో చేసేదిలేక ఆ పథకంపై ఆమోదముద్ర వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ పథకం చేపట్టడానికి పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుంది.

రూ.400 కోట్లు కమీషన్‌!
భూసేకరణ వ్యయాన్ని తీసివేస్తే.. ఈ పథకంలో పనుల కోసమే రూ.844 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ముందే ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్‌కు ఈ పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని జలవనరుల శాఖకు ఉన్నత స్థాయి నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పనులు చేపట్టడానికి జలవనరుల శాఖ పరిపాలన అనుమతి ఇవ్వడమే ఆలస్యం.. వాటిని కమీషన్‌లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు అప్పగించి కనీసం రూ.400 కోట్లకు పైగా దండుకోవడానికి ముఖ్య నేతలు రంగం సిద్ధం చేశారు.

మరిన్ని వార్తలు