జిల్లాకు జలగండం

27 Feb, 2018 12:27 IST|Sakshi
గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ఇదే దుస్థితి

ఈ వేసవిలో జనానికి తప్పని ఎక్కిళ్లు

శాశ్వత తాగునీటి సౌకర్యం లేని గ్రామాలెన్నో...

అప్పుడే పలు గ్రామాల్లో మొదలైన నీటి తిప్పలు

సమస్య అధిగమించేందుకు అధికారుల ప్రణాళిక

రూ.1024కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు

కన్నెత్తయినా చూడని సర్కారు

కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో తాగునీటిలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉంది. దీనివల్ల తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. రైల్వే ట్రాక్‌ అవతల ఉన్న బోరుకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు గేటు మూసేస్తున్నారు. ఇప్పుడు నీటికోసం ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. గత నెల 29న నిర్వహించిన జిల్లా గ్రీవెన్స్‌సెల్‌కు మండల లోక్‌సత్తా అధ్యక్షుడు ఐతంశెట్టి శ్రీనివాస్, ఇతర గ్రామస్తులు అందించిన వినతి.

విజయనగరం గంటస్తంభం: తాగునీటికి ఒకప్పుడు బావులపై ఆధారపడే వారు. ఇప్పుడు బోర్లపై ఆధారపడుతున్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలో బోర్లున్నా తాగునీటికి ఇబ్బందులు తప్పట్లేదు. ఉన్న బోర్లలో కొన్ని పనిచేయక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తుంటే... మరికొన్ని బోర్లనుంచి వచ్చే నీరు తాగేందుకు పనికిరావట్లేదు. ఇలాంటి పరిస్థితి ఉన్న చోట శాశ్వత తాగునీటికి రక్షిత మంచినీటి పథకాలే అనివార్యం. జిల్లాలో అన్ని గ్రామాలకు రక్షిత తాగునీరు అందడంలేదు.

30శాతం గ్రామాలకు అసలు రక్షిత మంచినీటి పథకాలే లేవు. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. పథకాలు ఉన్నచోట కూడా పైపులైన్లు లేకపోవడం, నీటిసరఫరా వ్వవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, కుళాయిలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో నీటి సమస్య మాత్రం తీరడంలేదు. జిల్లాలో 180 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందని చెబుతున్నా రక్షిత మంచినీటి పథకాలున్న 70శాతం గ్రామాల్లో 10 నుంచి 20శాతం గ్రామాల్లో మినహా అన్నిచోట్లా తాగునీటి సరఫరా వీధులన్నింటికీ వెళ్లడంలేదు. 

ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలో దాహం కేకలు వినిపించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయి రక్షిత నీటిసరఫరా చేయాలని అధికారులు భావించారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టు కింద ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు ద్వారా సమాచారం రావడంతో ఈ మేరకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రణాళిక తయారు చేయగా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 2560 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా చేసేందుకు తాగునీటి వనరులైన రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం, పాత వాటి విస్తరణ కోసం రూ.1024కోట్లు మంజూరు చేయాలని కోరారు.

ఈ ప్రతిపాదనలు గతేడాది ఆక్టోబర్‌లోనే ప్రభుత్వానికి వెళ్లాయి. రెండు, మూడు నెలల్లో నిధులు మంజూరైతే పనులు ప్రారంభించి వేసవికి ముందే పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని భావించారు. కానీ ఐదు నెలలు దాటుతున్నా ఇంతవరకు నిధుల విషయమే చర్చకు రాలేదు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ దీనపి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సర్కారు కూడా కనికరించలేదు. ఫలితంగా ఈ ఏడాది వేసవిలోనూ నీటి ఎద్దడి తప్పని పరిస్థితి నెలకొంది. 

నిధులు మంజూరైతే సమస్య తీరుతుంది
జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య ఉంటుంది. తాగునీటి సరఫరా అన్ని వీధులకు లేకపోవడంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాలు లేని గ్రామాలున్నాయి. అలాంటి చోట బోరు నీరు బాగులేకపోతే సమస్య ఉత్పన్నమవుతోంది. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారానికి ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టులో నిధులకోసం ప్రతిపాదించాం. నిధులు విడుదలైతే పనులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత అంతగా సమస్య ఉండదు. 
– ఎన్‌.వి.రమణమూర్తి, ఆర్‌డబ్యూఎస్‌ ఎస్‌ఈ 
 

మరిన్ని వార్తలు