హే.. కృష్ణా!

16 Dec, 2013 01:59 IST|Sakshi

 శంషాబాద్, న్యూస్‌లైన్: గత ఏడాది డిసెంబర్ 5న శంషాబాద్‌లో కృష్ణా నీటి సరఫరాను రాష్ట్ర ముఖ్యమత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత అప్పటి హోంమంత్రి సబితారెడ్డితో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లు స్థానికులకు ఇక తాగునీటి కష్టాలు తీరాయంటూ మరోసారి శంషాబాద్‌లో కృష్ణా నీటి సరఫరాకు సంబంధించి నల్లాను విప్పారు. అంతటితో ఊరుకోకుండా ఇరుపార్టీల నేతలు ఎవరికివారే కృష్ణా నీటి సరఫరా ఘనత తమదే అంటే తమదనేంటూ గొప్పలు చెప్పుకొన్నారు. కానీ పరిస్థితి మాత్రం అక్కడితోనే ఆగిపోయింది. తాగునీటి సరఫరా రెండురోజులకే పరిమితమైంది. వర్షాలు పుష్కలంగా వస్తేగానీ నీటి సరఫరాను చేయలేమంటూ కొంతకాలం జలమండలి సైతం చెత్తులెత్తేసింది. అంతటితో ఊరుకోకుండా డిపాజిట్ చెల్లిస్తేనే నీళ్లు విడుదల చేస్తామని తెగేసి చెప్పడంతో ఎట్టకేలకు సర్కారు గత అక్టోబర్ 23న జీవో 1659 జారీ చేసింది. ఇందులో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భాగస్వామ్యంతో  రూ. 13.36 కోట్ల నిధులను విడుదల చేసింది. సాంకేతికంగా ఇది పూర్తయినా ఇంకా అధికారికంగా జరగాల్సిన పనిమిగిలి ఉండడంతో శంషాబాద్‌కు పూర్తి స్థాయిలో నీటి విడుదల చేసే పరిస్థితి లేకుండాపోయిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
 
 పైపులకు సరిపోయే..
 గత ఆగ స్ట్ చివరి వారం నుంచి శంషాబాద్‌కు నీటి విడుదల చేస్తున్నట్లు జలమండలి చెబుతున్నా ప్రజలకు మాత్రం అవి అందడం లేదు. మూడురోజులకోసారి మూడు నుంచి నాలుగు లక్షల లీటర్ల నీటిని రాజేంద్రనగర్ సర్కిల్ దుర్గాన గర్ రిజర్వాయర్ నుంచి సరఫరా చేస్తున్నప్పటికీ.. అవి కేవలం పైప్‌లైన్‌లకు మాత్రమే సరిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. శంషాబాద్ అహ్మద్‌నగర్‌లోని ట్యాంకులోకి కేవలం మూడు నుంచి నాలుగు ఫీట్ల వరకు మాత్రమే నిండుతున్న కృష్ణా నీళ్లను స్థానికంగా సరఫరా చేయడానికి సిబ్బంది సైతం ముప్పతిప్పలు పడుతున్నారు. వచ్చీరాని నీళ్లను సరఫరా చేయలేని స్థానిక పంచాయతీ సిబ్బది ట్యాంకులోకి బోరునీటికి కూడా విడుదల చేస్తుండడంతో రెండు నీళ్లు ఒక్కచోట కలిసిపోతున్నాయి. ప్రస్తుతం సరఫరా అవుతున్న కొద్దిపాటి నీళ్లను కూడా కేవలం రెండు బస్తీలకు మాత్రమే విడుదల చేస్తున్నా అవి కూడా బోరునీటితో కలిసిపోవడంతో ఎందుకు ఉపయోగం లేకుండా పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 సంప్ నిర్మాణం పూర్తయినా..
 కృష్ణా నీటి సరఫరాకు స్థానిక మెహిదీ గార్డెన్‌లో మరో సంప్ ఏర్పాటు చేశారు. దీని పైప్‌లైన్ పనులు పూర్తి చేసినా నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో అందులోకి నీటిని సరఫరా చేయడం లేదు. యాదవ్ బస్తీ, కాపుగడ్డ తదితర బస్తీలకు ఇంతవరకూ కృష్ణా నీటి సరఫరా జరగనేలేదు.
 
 సమస్య సచివాలయం స్థాయిలో
 రూ. 13 కోట్లతోపాటు మరో పదమూడు కోట్ల రూపాయల నిధులను జలమండలికి డిపాజిట్ చేసి శంషాబాద్ వాసులకు తాగునీటిని అందించాలనే సర్కారు లక్ష్యం సచివాలయం స్థాయిలో స్తంభించిపోతోంది. జలమండలితో జరగాల్సిన ఒప్పంద ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి శంషాబాద్‌కు ప్రతిరోజు పదిహేను లక్షల లీటర్లను సరఫరా చేస్తే తప్ప పట్టణ ప్రజల దాహార్తి తీరదు. అధికారులు ఈ సమస్యపై ఏ మేరకు దృష్టిసారిస్తారో వేచి చూడాలి.
 
 రెండురోజులే వచ్చాయి
 కృష్ణా నీళ్లు కేవలం రెండురోజులే వచ్చాయి. ఆ తర్వాత ఇప్పటివరకూ రాలేదు. అధికారులు వస్తున్నాయని చెబుతున్నా మేం ఇంతవరకు కృష్ణా నీటిని తాగింది లేదు. నీటి కోసం ఎంతో ఖరు చేస్తున్నాం. త్వరగా నీళ్లు వచ్చేలా సమస్యను పరిష్కరించాలి.    
 - ఖాదర్ , అహ్మద్‌నగర్, శంషాబాద్
 
 చెప్పడమే తప్ప వచ్చింది లేదు
 అధికారులు.. నాయకులు ప్రారంభించినప్పుడు ఒకటి రెండుసార్లు మాత్రమే నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత ఇంతవరకూ కృష్ణా నీళ్లు రానేలేదు. వస్తున్నాయని చెప్పడమే తప్ప ఇంతవరకు వచ్చింది లేదు.
 - అర్జున్, శివాజీ బస్తీ, శంషాబాద్
 
 

మరిన్ని వార్తలు