దాహం తీరే దారేది ?

22 Mar, 2015 03:07 IST|Sakshi

 జిల్లా ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. స్వచ్ఛమైన నీటి కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ఏజెన్సీలో చెలమ, ఊట నీరుపైనే ఆధారపడుతున్నారు. ఈ నీటి  కోసం కిలోమీటర్లు నడిచెళ్లి తెచ్చుకుంటున్నారు. మండుటెండలో, నెత్తిన రెండుమూడు బిందెలు మోస్తూ మహిళలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు.  అరకొర మంచినీటి పథకాలు...అందుబాటులో లేని వనరులతో ఏటా జిల్లాలో తాగునీటి  ఎద్దడి తీవ్రరూపం  దాల్చుతోంది. అయితే తాము తాగునీటి ఎద్దడి తీరుస్తామని, దాని కోసం వాటర్ గ్రిడ్‌లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన చంద్రబాబునాయుడు,  జిల్లాకు కావలసిన నిధులు మంజూరు చేయడంలేదు. దీంతో వాటర్ గ్రిడ్‌లు, ఇతర పథకాలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా జిల్లా వాసులు దాహార్తితో అల్లాడిపోవలసిందే.  
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  జిల్లాలో పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని గత కాంగ్రెస్ ప్రభుతం భారీ మంచినీటి పథకాల్ని మంజూరు చేసింది. ఎప్పటికప్పుడు నిధులు కూడా విడుదల చేసింది. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ‘మాదొక విజన్..దాని ప్రకారమే ముందుకెళ్తాం...దూరదృష్టితో పనిచేస్తాం’ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసేందేమీ కనిపించడంలేదు.   ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి.  అవసరాల్ని గుర్తించి, లెక్కలు వేసి నివేదికలివ్వాలంటూ అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు నిధులకొచ్చేసరికి మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో జిల్లా ప్రజల దాహంతీరే దారి కనిపించడంలేదు.  
 
 పక్కకు వాటర్ గ్రిడ్‌ల ప్రతిపాదన
 జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే వాటర్ గ్రిడ్‌ల  ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని అధికారులు గుర్తించారు. నదులు, జలాశయాల మిగుల జలాల వినియోగంతోనే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు.  దీంతో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను సర్కార్ ఆదేశించింది.  యుద్ధ ప్రాతిపాదికన ప్రతిపాదనలు రూపొందించారు. జిల్లాలో ఉన్న రెండు ప్రధాన నదులు, ఏడు జలాశయాల నుంచి మిగులు నీటిని ప్రత్యేక గ్రిడ్‌ల ద్వారా మళ్లించి, వాటిని శుద్ధి చేసి తాగునీటిగా మార్చాలని ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలోని 33 మండలాల్లో 2,219 గ్రామాలకు  తాగునీటి అందించేందుకు రూ.3,650 కోట్ల అంచనా వ్యయంతో  తొమ్మిది  వాటర్ గ్రిడ్‌లకు ప్రతిపాదనలు తయారు చేసి,   ప్రభుత్వానికి   పంపించారు.
 
  కానీ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టేసింది. అలాంటి ఆలోచనేది లేదని పరోక్షంగా చెప్పేసింది. ఈ విడతలో లేదంటూ చేతులేత్తేసింది. దీంతో అధికారులు వాటర్ గ్రిడ్‌ల విషయాన్ని మరుగున పడేశారు. వాటర్ గ్రిడ్‌ల విషయాన్ని పక్కన పెడితే జిల్లా ప్రజల దాహార్తిని తీర్చాలంటే రూ.447 కోట్లు అవసరమని ప్రభుత్వానికి జిల్లా అధికారులు మరో ప్రతిపాదన పంపించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి వసతి కల్పనకు రూ.91కోట్ల వ్యయంతో 744 పనులు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. రూ.22కోట్లతో పాక్షిక మంచినీటి పథకాలు నిర్మించాల్సి ఉందని, ఇప్పటికే మంజూరైన 14 భారీ మంచినీటి పథకాలు పూర్తి చేయాలంటే రూ.297కోట్లు అవసరమని ప్రతిపాదించారు. జాతీయ గ్రామీణాభివృద్ధి మంచినీటి ప్రాజెక్టు(ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) కింద 142 పనులు చేపట్టేందుకు రూ.28 కోట్లు మంజూరు చేయాలని, పైపులు లీకేజీలు, సోర్సులు సరిచేసేందుకు, అదనపు పైపులైన్లు తదితర 230 పనులకు రూ.5.22 కోట్లు మంజూరు చేయాల్సి ఉందని, సౌర పద్ధతిలో తాగునీటి సరఫరాకు రూ.4కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
 
 ఈ విధంగా మొత్తం రూ.447కోట్లు మంజూరు చేస్తే ప్రజలకు కొంతవరకైనా  తాగునీటిని అందించవచ్చని ప్రభుత్వానికి సూచించారు. కానీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. జిల్లా నుంచి వెళ్లిన రూ.447 కోట్ల ప్రతిపాదనలను పక్కన పెడితే, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌డబ్ల్యూఎస్ కోసం మొన్నటి బడ్జెట్‌లో రూ.881 కోట్లు కేటాయించింది. ఒక్క విజయనగరం జిల్లాకే రూ.447 కోట్లు అవసరమైతే...రాష్ర్టమంతటికీ ప్రభుత్వం కేటాయించిన రూ.881కోట్లు ఏ మేరకు సరిపోతాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కేటాయించిన విధంగా చూస్తే జిల్లాకు రూ.60కోట్లుకు మించి వచ్చే అవకాశం లేదు. అవి కూడా విడుదల చేయాలనే చిత్తశుద్ధి ఉంటేనే. ఒకవేళ వచ్చినా ఏ కొసాన సరిపోవు.   
 

మరిన్ని వార్తలు