నగరవాసులపై నీటి పిడుగు

11 May, 2019 13:52 IST|Sakshi

ఈనెల 15 నుంచి నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా

ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో తగ్గిన నీటిమట్టం

సకాలంలో వర్షాలు కురిస్తేనే నీటి కష్టాలు తీరేది

లేదంటే ఆగస్టు తర్వాత ఇబ్బందే!

ఒంగోలు టౌన్‌: ఒంగోలు నగర ప్రజలపై నీటి పిడుగు పడింది. ఇప్పటికే మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తుండగా, ఈనెల 15వ తేదీ నుంచి అదనంగా మరోరోజు కలిపి నాలుగు రోజులకు ఒకసారి నీటిని అందించాలని నగర పాలక సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయనున్నట్లు నగర పాలక సంస్థ ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లో ఉన్న నీటి పరిమాణాన్ని బట్టి నాలుగు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తే జూలై చివరి వరకు వస్తాయని నగర పాలక సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురిస్తేనే నగర ప్రజల తాగునీటి సమస్య తీరుతోంది. రుతుపవనాల రాక ఆలస్యమై సకాలంలో వర్షాలు కురవకుంటే ఆగస్టు నుంచి నగర ప్రజల గొంతెండటం ఖాయంగా కనిపిస్తోంది.

లీక్‌ల నిర్లక్ష్యం..
నగర ప్రజలకు మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్న తరుణంలో పైపులైన్లు లీక్‌ అయి నీరు వృధాగా పోతున్నా నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోలేదు. కొన్నిచోట్ల పాత పైపులైన్లు ఉండటంతో తరచుగా లీక్‌ అవుతూ ఉన్నాయి. మరికొన్నిచోట్ల పైపులద్వారా నీరు లీకై కాలువల పాలవుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోజుల తరబడి లీక్‌ అయితే వాటిని నియంత్రించకపోవడంతో విలువైన నీరు వృధాగా కాలువల పాలయ్యేది. పైపులైన్ల నుండి నీరు లీక్‌ అయిపోతున్నప్పటికీ అధికారులు వెంటనే స్పందించకపోవడంతో నీటి సమస్యకు కొంత కారణమైంది.

‘డెడ్‌’ స్టోరేజీ..
ఒంగోలు నగరంలో 2.70 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. వారి తాగునీటి అవసరాల కోసం రోజుకు 100 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం అవుతోంది. అయితే ప్రస్తుతం నగర పాలక సంస్థ మూడు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తోంది. రెండు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల నీటి నిల్వ సామర్ధ్యం 5300 మిలియన్‌ లీటర్లు. ప్రస్తుతం రెండు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లో 1964.44 మిలియన్‌ లీటర్ల నీరు ఉంది. వాటిలో డెడ్‌ స్టోరేజీ కింద 1000 మిలియన్‌ లీటర్ల నీరు పోతోంది. అంటే నగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు రెండు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లో కేవలం 964మిలియన్‌ లీటర్ల నీరు ఉన్నట్లు. ఈ 964 మిలియన్‌ లీటర్ల నీటిని నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తే నగర పాలక సంస్థ అంచనా వేస్తున్న విధంగా జులై వరకు రావడం కూడా కష్టమే. ఈ నేపధ్యంలో ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తుండగా, 15వ తేదీ నుంచి నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తామని ప్రకటించారు. మున్ముందు ఆ ప్రకటన ఐదు రోజులు, ఆరు రోజులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ముందు చూపేది..
ఒంగోలు నగరానికి సీజన్లతో సంబంధం లేకుండా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా ఐదేళ్లు వ్యవహరించిన దామచర్ల జనార్ధన్‌రావు ప్రజల తాగునీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగర ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నంతకాలం ఏనాడు ప్రతిరోజూ తాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవు. గుండ్లకమ్మ నుండి ఒంగోలుకు తాగునీటిని సరఫరా చేసేందుకు పైపులైన్ల నిర్మాణంలో దామచర్ల నిర్లక్ష్యం నగర వాసులకు శాపంగా మారింది. దాంతో ఒంగోలు నగర ప్రజలకు తాగునీటి సమస్యను కొంతమేర పరిష్కరించాలంటే నాగార్జునసాగర్‌ నుండి నీటిని సరఫరా చేయడమే. నగర ప్రజల తాగునీటి కోసం నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్‌ వినయ్‌ంద్‌కు ముందు చూపు లేకపోవడం కూడా ప్రజలకు తాగునీటి కష్టాలను తెచ్చిపెడుతోంది. జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లు పూర్తిచేసుకొని మూడవ సంవత్సరంలో అడుగుపెట్టిన ఆయన అంతే సమయం నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ప్రతి ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక అధికారి పూర్తిగా విఫలమైనారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మధ్యలోనే మళ్లింపు..
ఒంగోలు నగర ప్రజల తాగునీటి కోసం నాగార్జునసాగర్‌ నుంచి విడుదల చేసిన నీటిని మధ్యలోనే దారి మళ్లించడంతో అనుకున్నంత మేర సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులకు నీరు చేరలేదు. సాగర్‌ నీటి సరఫరాకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ దారి మళ్లింపును మాత్రం అడ్డుకోలేకపోయాయి. కాలువ ద్వారా నీటి సరఫరా జరుగుతున్న తరుణంలో పలు గ్రామాల్లోని ఆర్‌డబ్లు్యఎస్‌ ట్యాంకులను నింపుకోవడం జరిగింది. మరికొన్నిచోట్ల పొలాలకు అక్రమంగా నీటిని తరలించుకున్నారు. నీటి చౌర్యం జరుగుతున్నా వాటిని నియంత్రించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడంతో నగర ప్రజలకు నీటి కష్టాలు తెచ్చి పెట్టాయి.

ప్రజలు సహకరించాలి...
నగరంలో ఈనెల 15వ తేదీ నుంచి నాలుగు రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నందున ప్రజలు సహకరించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ కంఠమనేని శకుంతల కోరారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఇప్పటికే 280 ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంత ప్రజలకు, నగరంలో విలీనమైన గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నామని, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నందున ప్రజలు తమకు సహకరించాలన్నారు. – శకుంతల, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌

మరిన్ని వార్తలు