ఎక్కిళ్లు!

18 Apr, 2019 13:21 IST|Sakshi
గాలివీడు మండల కేంద్రంలోని టెంకాయచెట్లవీధిలో బిందెలతో ప్రజలు

ఎక్కడ చూసినా నీటి చుక్కకు కష్టాలు

ఎండిపోతున్న బోర్లు

కొన్నిచోట్ల నాలుగైదు రోజులకు కూడా సరఫరా కాని నీరు

వ్యవసాయ బోర్ల వద్దకు పల్లె జనం పరుగులు  

ప్రభుత్వ అలసత్వం..అధికారుల ముందుచూపులేని వ్యవహారం వల్ల పల్లె, పట్టణాల ప్రజలకునీటికష్టాలు తప్పడంలేదు.రాత్రంతా మేలుకున్నా..పగలంతా ఎదురుచూసినా...కొళాయిలోనీటి చుక్క కనిపించడం లేదు. వేసవి ఆరంభానికి ముందు కేవలం 100 గ్రామాల్లోపే  సమస్య ఉండగా..అది కాస్త 500కు చేరిందంటే  జిల్లాలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందోఅర్థమవుతోంది. ఒకప్పుడు నీటితో కళకళలాడిన
పల్లెలు సైతం నేడు  దాహమో రామచంద్రాఅంటూ గగ్గోలు పెడుతున్నాయి.

సాక్షి కడప/ఎడ్యుకేషన్‌: జిల్లాలో దాహం కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి.నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు.  కొందరు వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తుండగా..మరికొందరు ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.గత ఏడాది ఇదే సమయానికి కేవలం 17 గ్రామాల్లోనే తాగునీటి సమస్య ఉండగా, ఈసారి  వందలు దాటింది. ఖరీఫ్‌తోపాటు రబీలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతోనే ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు.

544 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
 జిల్లాలో ప్రస్తుతం ఎండలు ముదిరాయి. బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు.  జిల్లాలో 790 పంచాయతీలకుగాను 4,446మజరా గ్రామాలు ఉన్నాయి. మొత్తం మీద 544 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అధికారులు ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకర్ల వద్ద జనాలు బారులు తీరుతుండడం..సంపూర్ణంగా నీటిని అందుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే స్కీమ్‌ ద్వారా వస్తే పూర్తి స్థాయిలో ఇంటి అవసరాలకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ట్యాంకర్లు కావడంతో అరకొరగా పట్టుకోవాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు.  

100 గ్రామాలకు అద్దె బోర్లతో నీటి సరఫరా
జిల్లాలో తాగునీటి సమస్య నేపథ్యంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని పల్లెలకు నీరు అందిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో రాయచోటి నియోజకవర్గంతోపాటు బద్వేలు, కమలాపురం, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, మైదుకూరు, పులివెందుల, రాజంపేట ప్రాంతాల్లోని 31 మండలాల్లో  సమస్య తీవ్రంగా ఉంది. సుమారు 100 గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లలో ఒక్కో బోరుకు రోజుకు రూ. 150 అద్దె చెల్లించి నీటి సరఫరా సాగిస్తున్నారు.

పట్టణాలను వేధిస్తున్న సమస్య
జిల్లా కేంద్రమైన కడపతోపాటు పలు పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నగరంలోని అనేక కాలనీలకు ఐదారు రోజులకు గాని నీరందని పరిస్థితి నెలకొంది. రాత్రింబవళ్లు మేలుకున్నా నీరు  రావడం లేదు. దీంతో వచ్చిన సమయంలోనే డ్రమ్ములకు నింపుకుని పొదుపుగా వాడుకుంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. కడప నగరంతోపాటు జిల్లాలోని పలు మున్సిపాలిటీలను నీటి సమస్య వేధిస్తోంది.ఈరోజు బోరులో నీరు వస్తే రేపు వస్తుందో, రాదో అన్న ఆందోళన అధికారులను వెంటాడుతోంది.

ప్రజలపై ఆర్థికభారం
కడప నగరంలో ఐదారు రోజులకు ఒకసారి నీరు రావడంతో ప్రైవేటు ట్యాంకర్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఒక్కో ట్యాంకరును  రూ. 500–600 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా  నీటిని తెప్పించుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో 26.89 మీటర్ల లోతులో  ఉన్నాయి.గత ఏడాది ఇదే సమయంలో 15 మీటర్ల లోతులో ఉండేవి.

బిందె నీరు కరువు
మా గ్రామంలో గత నెలరోజులుగా తాగునీటి సమస్య  వేధిస్తోంది.   సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం.  గ్రామానికి రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటిని   కూడా టీడీపి వారికే పంపుతున్నారు.   వైఎస్సార్‌ కాలనీలో సమస్య ఉన్నా  వారికి   పట్టడం లేదు. విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు,  ఉన్నతాధికారులు స్పందించి తాగునీటిని  అందించాలి. –  హుస్సేనయ్య,
ఆకులనారాయణపల్లె . కాశినాయన మండలం

మరిన్ని వార్తలు