పెన్నమ్మకు దాహార్తి

5 Aug, 2015 02:48 IST|Sakshi

 కడప కార్పొరేషన్ : నగరపాలక వర్గం, అధికార యంత్రాంగం ముందుచూపుతో వేసవి గండాన్ని అధిగమించిన కడప నగరపాలక సంస్థకు మరో గండం ఆగస్టు మాసం రూపంలో ముంచుకొస్తోంది. జూన్, జూలై మాసాల్లో వర్షాలు సరిగా పడకపోవడంతో పెన్నా పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది.  మరో వారం రోజుల తర్వాత కడపలో తాగునీటి సమస్యలు తీవ్రమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. మార్చి మాసంలోనే వేసవిలో త లెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా అలగనూరు, వెలుగోడు నుంచి నీటిని విడుదల చేయించి గండి, లింగంపల్లిల వద్ద నిల్వ చేయడం ద్వారా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకొన్నారు.

వేసవి గండం గడిచిపోయిందిలే అని ఊపిరి పీల్చుకొనేలోపు ఆగస్టు గండం వచ్చిపడింది. వేసవిలో అధికారులు నిల్వ చేసిన నీరంతా నెలరోజుల క్రితమే ఆవిైరె పోయింది. దీంతో భూగర్భ జలాలు పదహారు అడుగులకు పడిపోయాయి. ఇప్పటికే చాలా బోర్లలో నీరు అందక ఇంకా లోతుకు పైపులు దించుతున్నారు. జూన్, జూలైలో వర్షాలు పడతాయని అనుకొంటే చినుకు కూడా రాలలేదు, శ్రీశైలం డ్యామ్‌లో కూడా డెడ్‌స్టోరేజీ ఉండటంతో కృష్జాజలాల ఆధారంగా ఉన్న చిన్న చిన్న నదులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. అందులో భాగంగానే పెన్నా కూడా ఎండిపోయింది. 2008 సెప్టెంబర్‌లో కూడా సక్రమంగా వర్షాలు కురవకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. ఇప్పుడు ఒకనెల ముందే అదే పరిస్థితి పునరావృతమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

 - కడప నగరపాలక సంస్థ పరిధిలో 3.46లక్షల మంది జనాభా ఉండగా, వీరందరికీ సరిపడా తాగునీరు సరఫరా చేయాలంటే 55ఎంఎల్‌డీల నీరు అవసరమవుతుంది. పెన్నాలో నీరుంటే  లింగంపల్లి వాటర్‌వర్క్స్‌నుంచి 35 ఎంఎల్‌డీల వరకూ నీరు పంపింగ్ చేయవచ్చు. కానీ ప్రస్తుతం  30 ఎంఎల్‌డీలు మాత్రమే వస్తోంది. గండి వాటర్ వర్క్స్‌నుంచి 15 ఎంఎల్‌డీలకుగాను 13ఎంఎల్‌డీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. ఈదురు గాలులు,  నదిలో నీరు లేకపోవడం వల్ల లింగంపల్లి, గండిలలో ఉన్న  బోరుబావులు ఒకటి తర్వాత ఒకటి అడుగంటిపోతున్నాయి. దీంతో అధికారులు బావుల్లో మరింత లోతుకు పైపులు వేసి నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు.

గండిలో 8 బోరుబావులుండగా, లింగంపల్లిలో మొత్తం 44 ఫిల్టర్ పాయింట్లు ఉన్నాయి. ఇవి కూడా చాలావరకూ అడుగంటిపోయే పరిస్థితికి వచ్చాయి. మహా అంటే మరో వారం రోజులు మాత్రమే నీరు లభించే అవకాశాలు ఉంటాయని, ఆ తర్వాత పెన్నాకు నీరు రాకపోతే కడప వాసులకు కష్టాలు తప్పవని తెలుస్తోంది.

 - కడప నగరానికి ఎదురు కాబోతున్న నీటిఎద్దడిని గుర్తించి ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న మల్లికార్జున పుష్కరాల సమయంలోనే  ఈఎన్‌సీకి లేఖ రాశారు. వెలుగోడు నుంచి నీరు వచ్చే అవకాశం లేనందున అలగనూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని అందులో పేర్కొన్నారు. ఇటీవల కడపకు వచ్చిన పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ కూడా నగరపాలక అధికారులు చెబుతున్నది వాస్తవమేనని, కడపకు తాగునీటి అవసరాలకోసం నీటిని తప్పక విడుదల చేయాల్సిందేనని ఈఎన్‌సీకి నివేదిక కూడా ఇచ్చారు. ఈ మేరకు అలగనూరు నుంచి నీటిని విడుదల చేశారని చెబుతున్నారు.కానీ ఆ నీటిని మధ్యలోనే రైతులు తోడేస్తే గతసారిలాగే నీరు గండి, లింగంపల్లికి చేరడం చాలా ఆలస్యమవుతుంది కాబట్టి నీరు ఎంతవరకు వచ్చిందో చూసేందుకు ఒకరిద్దరు అధికారులు నేడు రాజోలి వద్దకు వెళ్తున్నట్లు సమాచారం.

 - కేసీకి నీరు వదిలితే సమస్య తప్పుతుందని నగరపాలకవర్గం, అధికారులు భావిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి కేసీ కెనాల్‌కు నీరు వచ్చే వరకైనా అలగనూరు నుంచి వదిలిన నీరు గండికి చేరితే కొన్ని రోజులైనా సమస్యలు రాకుండా ఉండే అవకాశాలుంటాయి.  ఇదిలా ఉండగానే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి కేంద్రీకరించారు. గండిలో మూడు బోర్లు, బుగ్గలో ఒక బోరు రైతులనుంచి అద్దెకు తీసుకొంటున్నారు. కడప నగరంలో అక్కడక్కడా ఉన్న బోర్లను కూడా వినియోగించుకోవాలని చూస్తున్నారు.

మరిన్ని వార్తలు