జల గండం

16 Apr, 2019 10:53 IST|Sakshi

తాగునీటి సమస్యతో జనం సతమతం

నీటి సరఫరా లేక.. మినరల్‌ వాటర్‌ క్యాన్లే గతి

అవసరం కొండంత.. సరఫరా గోరంత

ఎన్టీఆర్‌ సుజలం హామీకే పరిమితం

జిల్లాలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పాలకుల నిర్లక్ష్యంతో ఉన్న నీటి వనరులను అందుబాటులోకి తీసుకురాలేని పరిస్థితి. ఎన్టీఆర్‌ సుజలం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.2లకే 20 లీటర్ల తాగునీరు ఇస్తామన్న చంద్రబాబు హామీ అటకెక్కింది. ఫలితంగా సామాన్యుడికి తాగునీటి కోసం అదనపు భారం తప్పడం లేదు.

సాక్షి, తిరుపతి: జిల్లాలో 1,363 పంచాయతీలు, 11,189 గ్రామాలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 1,965 గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అనధికారికంగా చూస్తే ఈ సంఖ్య రెట్టింపుగా ఉంది. అయినా అధికారులు మాత్రం తాగునీటి సమస్య తీవ్రతను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరి, ఏర్పేడు మండలంలోని నల్లపాలెం, చెన్నంపల్లి, పెన్నగడ్డం, పెనుమల్లం గ్రామాల్లో భూగర్భ జలాలు ఉన్నా.. గాజులమండ్యం పారిశ్రామిక వాడ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా నీరు కలుషితమైంది. దీంతో ఆ గ్రామాల ప్రజలు ప్రతి రోజూ మినరల్‌ వాటర్‌ క్యాన్లు కొనుగోలుచేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వాగులు, వంకలు, నదుల్లో ఇసుకను విచ్చలవిడిగా తోడెయ్యడంతో పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి.

నిలువెత్తు నిర్లక్ష్యం
పాలకులు, అధికార యంత్రాంగ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో అనేక బోర్లు మరమ్మతులకు నోచుకోక మూలనపడ్డాయి. నీరు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి. గ్రామాల్లో వాటర్‌ హెడ్‌ ట్యాంకులు ఉన్నా నిరుపయో గంగా దర్శనమిస్తున్నాయి. వాటికి నీటిని సరఫరా చేయాల్సిన బోర్లు పనిచెయ్యకపోవడంతో ట్యాంకులు దిష్టిబొమ్మలా మారాయి. 1,965 గ్రామాలకు 1,641 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం మూడు నెలల కాలంలో రూ.6 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆ గ్రామాల్లో కేవలం 25శాతం కుటుంబాలకు మాత్రమే నీరు అందుతోందని, మిగిలిన 75శాతం మంది కుటుంబాలకు నీరు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాలకుల నిర్లక్ష్యం..ప్రైవేటు ట్యాంకర్లకు కాసుల వర్షం
కాలువలు, ప్రాజెక్టులు పూర్తి చేసి తాగునీటి సమస్య తీరుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్తుంటారు. హంద్రీ–నీవా కాలువకు నీరు ఇచ్చినా ఆ నీరు కేవలం కాలువ సాగడానికే సరిపోయాయి. ఐదేళ్ల కాలంలో పూర్తిచేసే అవకాశం ఉన్నా.. గాలేరు–నగరి పూర్తి చెయ్యలేదు. బాలాజీ రిజర్వాయర్, సోమశిల స్వర్ణముఖి కాలువలు పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులకు నీటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా బోర్లు వేసి నీటిని తోడుకుని అమ్ముకుంటున్నా పట్టించుకునే దిక్కులేదు.

డబ్బాల్లో మురుగు నీళ్లు
జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా నీటిని విక్రయిస్తున్నారు. పేరుకు మినరల్‌ వాటర్‌ ఆ నీరు తాగితో గొంతు నొప్పి.. జలుబు వంటి రోగాలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రకరకాల పేర్లతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వాటర్‌ ప్లాంట్ల యాజమాన్యం వద్ద నెలనెలా మామూళ్లు పుచ్చుకుని వదిలేస్తున్నారు. మొత్తంగా జనం మంచినీటి సమస్యతో సతమతమవుతున్నా అటు పాలకులు.. ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా