గ్రామాల్లో దాహం కేకలు

7 Mar, 2019 08:30 IST|Sakshi
బగ్గందొరవలస వద్ద నిర్మించిన మంచినీటి పథకం

పాడైన బగ్గందొరవలస మంచినీటి పథకం

అల్లాడుతున్న 18 గ్రామాల ప్రజలు

సీతానగరం: మండలంలోని సువర్ణముఖీనదిపై బగ్గందొరవలస మంచినీటి పథకం పాడవ్వడంతో పలు గ్రామాల ప్రజలు పది రోజులుగా అవస్థలు పడుతున్నారు. బగ్గందొరవలస వద్ద 2007లో రూ. 7 కోట్ల వ్యయంతో 38 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేవిధంగా పైలెట్‌ ప్రాజెక్ట్‌ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ నిధులు మంజూరు చేశారు. అప్పట్లోనే రెండు విడతలుగా పథకాన్ని నిర్మించాలని ఉన్నతాధికారులు భావించారు. మొదటి విడతగా 24 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడానికి వీలుగా బగ్గందొరవలస వద్ద ట్యాంక్‌ ఏర్పాటు చేయడంతో పాటు బగ్గందొరవలస నుంచి బగ్గందొరవలస, బీకే పురం, తామరఖండి, కాశీపేట, బక్కుపేట, అంటిపేట మీదుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లచ్చయ్యపేట వరకు.. చినబోగిలి జంక్షన్‌ నుంచి అనంతరాయుడుపేట, ఏగోటివలస, దయానిధిపురం, పీబీపేట గ్రామాల మీదుగా 12 కిలోమీటర్ల దూరాన ఉన్న జయంతిరాయపురం వరకు.. కాశీపేట జంక్షన్‌ నుంచి పణుకుపేట, రంగంపేట, 5 కిలోమీటర్ల దూరాన ఉన్న కె. సీతారాపురం వరకు.. అలాగే అంటిపేట నుంచి వెంకటాపురం మీదుగా వీబీపేట వరకు పైప్‌లైన్లు అమర్చారు.

ఆయా గ్రామాల శివారుల్లో  ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు రూ. 3. 5 కోట్ల వ్యయంతో 2009 ఫిబ్రవరి నాటికి ఏర్పాటు చేసి 24 గ్రామాలకు తాగునీరు సరఫరా చేశారు. మరో ఐదు గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉన్నా సరఫరా కాలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి 19 గ్రామాలకు తాగునీరు తాగునీరు సరఫరా చేయాలని నిర్ధారించి పనులు చేపట్టారు. అప్పటినుంచి అరకొర నీటి సరఫరే తప్ప పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. ప్రస్తుతం మంచినీటి పథకం పాడవ్వడంతో బగ్గందొరవలస, బీకేపురం, తామరఖండి, కాశీపేట, బక్కుపేట, అంటిపేట, లచ్చయ్యపేట, చినబోగిలి, అనంతరాయుడుపేట, ఏగోటివలస, తదితర గ్రామాలకు తాగునీరు సరఫరా కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

 ఆ సంఘటన మరువలేం..
పైలెట్‌ ప్రాజెక్ట్‌ పథకం నీటి నుంచి తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో 2014లో గ్రామ శివారున ఉన్న చెరువు నీరు తాగాల్సి వచ్చింది. ఆ సమయంలో చెరువు నీరు కలుషితం కావడంతో ఐదుగురు మృతి చెందారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకముందే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలి.– పి. నాగభూషణరావు, మాజీ సర్పంచ్, అంటిపేట

తప్పని ఇక్కట్లు
మాగ్రామంలో ఉన్న బోర్లలో నీరు లభ్యత తక్కువ. దీంతో అంద రం బగ్గందొరవలస మంచినీటి పథకంపైనే ఆధారపడుతున్నాం. పది రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. విషయాన్ని అధికారులకు తెలియజేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.  – వై. సత్యనారాయణ, రైతు, ఏగోటివలస

మరిన్ని వార్తలు