సుజలం .. దుర్లభం

16 Dec, 2015 00:43 IST|Sakshi
సుజలం .. దుర్లభం

నాణ్యత ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు
కలుషితమవుతున్న మినరల్ వాటర్
రోగాల బారిన పడుతున్న ప్రజలు

 
స్వార్థం మానవ విలువలను మింగేస్తోంది..ఏం కొనాలన్నా..ఏం తినాలన్నా కల్తీమయమై భయపెడుతున్నారుు.. తినే నూనె బొట్టులోనూ, తాగే నీటి చుక్కలోనూ నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయి.. అధికారుల అలసత్వం ఒకవైపు.. అలవిగాని దురాశ మరోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి..
 
చిలకలూరిపేట :  ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని చోట్లా తాగునీటి సమస్య తలెత్తింది. దీంతో ప్రజలు, అధికారులు ప్రత్యామ్నాయ జల వనరులపై దృష్టి కేంద్రీకరించారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడూ లేని విధంగా ఓగేరువాగు నీటిని ప్రజలకు సరఫరా చేసి విమర్శల పాలయ్యారు. ఒక వైపు ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా మినరల్ వాటర్ పేరుతో కొత్త దోపిడీకి తెరతీశారు.

లాభార్జనే ధ్యేయంగా నీటి వ్యాపారం..
 గ్రామీణ ప్రాంతల్లో అనుమతులు తీసుకొని వాటర్ ప్లాంట్ పెట్టాలంటే కనీసం రూ. 40 నుంచి 50 లక్షలు ఖర్చవుతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో కోటిపైనే. ప్లాంట్ ఏర్పాటుకు 22 అంశాల్లో ప్రాధాన్యమివ్వాలి. నీటి నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్, అందులో బీఎస్సీ కెమిస్ట్రీ వ్యక్తిని, మైక్రోబయాలజీ ల్యాబ్, ఎమ్మెస్సీ బయాలజీ వ్యక్తిని నియమించాలి. వాటర్ బాటిల్స్ నింపే ప్రాంతంలోనూ, ల్యాబ్‌లోనూ ఏసీ సౌకర్యం కల్పించాలి. పూర్తి స్థాయిలో పరిశుభ్రత పాటించాలి. ప్రస్తుతం నెలకొల్పుతున్న ప్లాంట్లలో ఇవేమీ పాటించడం లేదు. దీంతో ప్రజారోగ్యం అందోళనలో పడింది. నీరు శుద్ధి చేయకపోతే డయేరియా, కామెర్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీటి శుద్ది కోసం మోతాదు మించి క్లోరిన్ వాడితే ప్రాణాంతకరమైన క్యాన్సర్ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.
 
నిరుపయోగంగా మారిన నీటి పరీక్షల కిట్లు
అర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రతి ఏటా పరీక్షలు నిర్వహించి తాగటానికి నీరు పనికి వస్తుందా లేదా అని నిర్ధారిస్తారు. ప్రస్తుతం సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పంచాయతీల్లో తాగునీటి పరీక్షలు నిర్వహించడానికి కిట్స్ పంపిణీ చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటంతో ఇవి మూలన పడ్డాయి. తిరి ప్రస్తుతం ఫీల్ట్ టెస్టింగ్ కిట్స్ పేరుతో పంచాయతీలకు మళ్లీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవి వంద సార్లు ఉపయోగపడతాయి. ఈ కిట్స్ ద్వారా చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీటి పరీక్షలు నిర్వహించవచ్చు. పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించడానికి పంచాయతీ కార్యదర్శి, పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ, వెలుగు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు.     
 
కుళాయి నీళ్లే భేష్..
మినరల్ వాటర్ పేరుతో సరఫరా అవుతున్న నీటికన్నా శుద్ధి చేసిన కుళాయి నీళ్లే సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సరఫరా చేసే నీటిలో రంగు, మట్టి శాతం, ఫ్లోరైడ్, క్లోరైడ్ ప్రమాణాల మేర ఉంటాయి. మినరల్ వాటర్ పేరుతో చలామణి అవుతున్న నీటిలో ఇవి ఉండవు. ఉదాహరణ లీటర్ నీటిలో 0.6 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉండాలి. దీంతో ఎముకలు పటిష్టమవుతారుు. శుద్ధి చేసిన నీటిలో 0.1 మిల్లీగ్రాముల మేర మాత్రమే ఫ్లోరైడ్ ఉంటుంది. దీంతో ఎముకలు పటిష్టత కోల్పోతారుు.
 
 

మరిన్ని వార్తలు