సాగర్ జలాలొచ్చాయ్..

12 Aug, 2014 03:38 IST|Sakshi
సాగర్ జలాలొచ్చాయ్..

త్రిపురాంతకం: జిల్లా తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ప్రధాన కాలువ నుంచి సోమవారం నీరు విడుదల చేశారు. జిల్లా సరిహద్దు 85/3 వద్ద 700 క్యూసెక్కుల నీరు జిల్లాలో ప్రవేశించింది. ఈ నీటితో అధికారులు తాగునీటి చెరువులు నింపనున్నారు. జిల్లాలోని తాగునీటి చెరువుల్లో నీటిమట్టం అడుగంటింది. 129 ఆర్‌డబ్ల్యూఎస్ ట్యాంకులున్నాయి.

వీటిని ముందుగా నింపేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వీటి తరువాత మరో 160 మంచినీటి చెరువుల్ని నింపుతారు. తొలిరోజు 700 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా..క్రమేణా రెండు వేల క్యూసెక్కుల వరకు వచ్చే అవకాశం ఉందని సాగర్ డీఈ సత్యకుమార్ తెలిపారు. పది రోజుల పాటు నీరు విడుదల చేస్తారన్నారు. రైతులు సాగు అవసరాలకు ఈ నీటిని వినియోగించరాదని హెచ్చరించారు.
 
సాగర్ కాలువలు పరిశీలించిన ఎస్‌ఈ :
జిల్లాలోని తాగునీటి ట్యాంకులు నింపేందుకు సాగర్ జలాలు విడుదల చేసేందుకు ముందు ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ కోటేశ్వరరావు సాగర్ కాలవపై పర్యటించారు. రామతీర్థం జలాశయం నుంచి జిల్లా సరిహద్దు 85-3 వరకు ప్రధాన కాలువపై పర్యటించి పరిస్థితులు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు తగిన సూచనలు, సలహాలను అందించారు.
 
తాగునీటి అవసరాలు తీర్చేందుకు విడుదలవుతున్న నీరు వృథా కాకుండా ఉపయోగించుకోవాలని కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోకి తాగునీరు ప్రవేశించే సమయంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల సరిహద్దులో ఉండి పరిశీలించారు. ఆయన వెంట సాగర్ డీఈఈ సత్యకుమార్, ఏఈలు దేవేందర్, విజయేందర్ గుంటూరు జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు