పంటలను ముంచిన జల చౌర్యం

11 Dec, 2013 04:00 IST|Sakshi

 గుత్తి రూరల్, న్యూస్‌లైన్ : బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతల స్వార్థం 15 గ్రామాల అన్నదాతలకు భారీ నష్టం తెచ్చిపెట్టింది. చేపల పెంపకం కోసం చెరువుకు అక్రమంగా నీటిని తరలించేందుకు రిజర్వాయర్‌కు గండికొట్టారు. గండి కొట్టిన తర్వాత ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోవడంతో పిల్ల కాల్వలన్నీ తెగిపోయి నీరు పంట పొలాలను ముంచెత్తింది. గంటల వ్యవధిలోనే రూ.కోటి దాకా పంట నష్టం వాటిల్లింది. బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
 
 బాధితుల కథనం మేరకు... ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రాహ్మణపల్లి చెరువు పూర్తిగా నిండింది. ఇక్కడి కాంగ్రెస్ నేతలు చేపల పెంపకం చేపట్టాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అనధికారికంగా ఈ చెరువులో చేప పిల్లలను వదిలారు. ఇదే సమయంలో ఆయకట్టుకు నీటిని వదలడంతో చెరువులో నీటిమట్టం తగ్గుతూ వచ్చింది. చేప పిల్లలను కాపాడుకునేందుకు ఈ సారి కాంగ్రెస్ నేతలు చెర్లోపల్లి వద్ద ఉన్న  చండ్రాయునికుంట రిజర్వాయర్ నీటిపై కన్నేశారు. అక్కడి నుంచి ఎలాగైనా తమ చెరువుకు నీటిని తరలించి నింపుకోవాలనుకున్నారు. ఇందుకు ఎమ్మెల్యేను సంప్రదించారు.
 
 అందుకాయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముంది వారు సోమవారం రాత్రి మందీ మార్బలంతో వెళ్లి రిజర్వాయర్  వద్ద గండికొట్టారు. నీటి ఉధ ృతి ఎక్కువగా ఉండటంతో కాలువ వెంబడి ఉన్న గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల్లోని 15 గ్రామాల్లో దాదాపు 500 ఎకరాలలో సాగు చేసిన వేరుశనగ, జొన్న, వరి, కంది, ఆముదం పంటలు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ కోతకు గురికావడం, భూసారం కొట్టుకుపోవడంతో పదేళ్ల వరకు పంటలు సాగు చేసే పరిస్థితి లేకుండా పోయిందని చెర్లోపల్లికి చెందిన రైతులు రామాంజనేయులు, ఆకుల వెంకటేష్, మారెన్న, నర్సన్న, లాలెమ్మ, లక్ష్మిదేవి, ఆకుల రామాంజనేయులు, వెంకటలక్ష్మమ్మ, గోవిందు, సుంకమ్మ, ఆంజనేయులు, పెద్ద మారెప్ప, వెంకట్రాముడు, సుశీలమ్మ, రామన్న, నారాయణమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. అధికార పార్టీ నాయకులు చేపల పెంపకం ద్వారా రూ,లక్ష నష్టం వస్తుందని కక్కుర్తి పడి రిజర్వాయర్‌కు గండికొట్టి తమ పంటలను నీటిపాలు చేసి.. కోటి రూపాయల దాకా పెట్టుబడులు కోల్పోయేలా చేశారని బాధితులు శాపనార్థాలు పెట్టారు. ఇంత భారీ నష్టం జరిగినా రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు అధికారులు తిరిగి చూడలేదని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జల చౌర్యంపై సీపీఐ మండల కార్యదర్శి రాము, నాయకులు పూలమాబు, రమేష్, టీడీపీ మండల మాజీ కార్యదర్శి కోనంకి కృష్ణ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.
 

మరిన్ని వార్తలు