విభజన హామీలకు కట్టుబడి ఉన్నాం 

15 Jun, 2019 04:14 IST|Sakshi
ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్, చిత్రంలో రాష్ట్ర మంత్రి గౌతంరెడ్డి

ఏపీలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం

చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో ఎక్కువ మందికి ఉపాధి

పారిశ్రామిక వేత్తల సమావేశంలో కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌

తక్షణ ఉపాధి, అభివృద్ధే లక్ష్యమన్న రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

సాక్షి, తిరుపతి/తిరుపతి అర్బన్‌: విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ పునరుద్ఘాటించారు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ పేరిట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో కలసి శుక్రవారం తిరుపతిలో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ రంగాలు, సోలార్‌ ఆధారిత పరిశ్రమల స్థాపనకు మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఈ–వెహికల్స్‌పై త్వరలో ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తామని, ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించి యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధించే విషయమై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏర్పేడులో స్థాపించనున్న ఎంఎస్‌ఎంఈ ఎంటర్‌ప్రైజర్స్, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.ఏపీలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు పెద్దఎత్తున రావాల్సి ఉందన్నారు. 

ఎక్కువ మందికి ఉపాధి కల్పనే ధ్యేయం
పరిశ్రమల స్థాపన ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తూ ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ను జిల్లా స్థాయిలోనూ అమలు చేస్తామన్నారు. 

తిరుపతి రైల్వే స్టేషన్‌కు గోల్డ్‌ రేటింగ్‌ అవార్డు 
తిరుపతి రైల్వే స్టేషన్‌కు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ప్రకటించిన గోల్డ్‌ రేటింగ్‌ అవార్డును కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్, రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి రైల్వే అధికారులకు అందజేశారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ 50 శాతం కన్నా ఎక్కువ మెరుగైన వసతులు ఉన్న రైల్వే స్టేషన్లకు గ్రీన్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌ ఈ అవార్డులు ఇస్తోందన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్య, డీఆర్‌ఎం విజయప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు