శమీపై ఉన్న ఆయుధాలు దించండి

14 Oct, 2013 00:27 IST|Sakshi

నిజామాబాద్, న్యూస్‌లైన్: పాండవులు శమీ వృక్షంపై దాచి ఉంచిన ఆయుధాలు ఇన్నాళ్ల తర్వాత దించాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తన అత్తగారిల్లయిన నిజామాబాద్‌కు ఆదివారం ఆయన  వచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రగతిభవన్ వద్ద కొలువుదీరిన దుర్గామాతకు ఆయన సతీసమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం విలేక రులతో మాట్లాడుతూ ఇక శమీ వృక్షంపై ఆయుధాలు దాచి ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదన్నారు.

 

తెలంగాణ ప్రజలది ధర్మయుద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగిపోయిందని, కాకపోతే కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారులు, సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఢిల్లీలో జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి కోసమే శమీ వృక్షంపై ఉన్న ఆయుధాలు దించాలన్నారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరిగితే మరో పోరాటానికి నాలుగున్నర కోట్ల ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజలు వచ్చే ఏడాది కచ్చితంగా స్వరాష్ట్రంలోనే దసరా సంబరాలు జరుపుకుంటారన్న విశ్వాసం వ్యక్తంచేశారు.
 

మరిన్ని వార్తలు