'మత్స్యకారులను ఆదుకుంటాం'

28 Jun, 2015 20:01 IST|Sakshi

బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన మత్స్యకారులను తీసుకువస్తాం
పొగాకు కొనుగోలు, ధరలపై 30న కేంద్రమంత్రిని కలుస్తాం
రాజధానికి భూములు ఇవ్వని చోట భూసేకరణకు వెళతాం


కొరిటెపాడు (గుంటూరు జిల్లా): బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన కాకినాడ మత్స్యకారులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి వర్షంలో చిక్కుకుపోయి ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకార కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సముద్రంలోకి వేటకు వెళ్లిన 43 బోట్లు గల్లంతయ్యాయని, వాటిలో ఒక్కటి మినహా మిగిలిన బోట్లు తిరిగి గమ్య స్థానాలకు చేరుకున్నాయని తెలిపారు. మత్స్యకారులపై అథారిటీ కోసం ఒక కమిటీ వేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాపాడటం కోసం టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా హైదరాబాద్‌లో ఉన్న తెలుగు ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యతకూడా తమపై ఉందన్నారు. హైదరాబాద్‌లో సెక్షన్-8ను తప్పక అమలు చేయాల్సిందేనన్నారు. గోదావరి పుష్కరాల కోసం రూ. 172 కోట్లు కేటాయించామని, 264 పుష్కర ఘాట్లు నెలకొల్పినట్లు తెలిపారు. పుష్కరాల కోసం 35 వేల మంది పోలీసు సిబ్బందిని, 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరాల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు కమిషనరేట్‌పై ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. పొగాకు కొనుగోలు, ధరలపై ఈ నెల 30న పొగాకు వ్యాపారులు, రైతులు, మంత్రులతో కూడిన ప్రతినిధి బృందం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. రైతుల వద్ద వున్న పొగాకును 45 రోజుల్లో కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేయటం జరిగిందన్నారు. పొగాకుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి రూ.28 వేల కోట్లు ఆదాయం లభిస్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక కస్టమర్ హైరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి రైతులకు అధునాతన వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనున్నట్లు వెల్లడించారు. రాజధాని కోసం ఇప్పటి వరకు 24 వేల ఎకరాల భూమిని సమీకరించినట్లు తెలిపారు. భూ సమీకరణకు సహకరించని చోట భూ సేకరణ ద్వారా భూమిని రాబడతామన్నారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ పతనం ఖాయమని జోస్యం చెప్పారు. పునర్విభజన చట్టానికి సెక్షన్ 8 గుండెకాయ లాంటిదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో సెక్షన్ 8ను అమలు చేయాల్సిందేనని.. లేకుంటే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు.

రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్ కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు