సంచలన కేసులు ఛేదించాం

30 Dec, 2014 03:17 IST|Sakshi

⇒గతంలో కన్నా పెరిగిన క్రైం
⇒చోరీ అయిన సొత్తు రూ.6.41 కోట్లు
⇒రికవరీ అయింది రూ.2.7 కోట్లు
⇒అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి

తిరుపతి క్రైం : తిరుపతి అర్బన్ జిల్లాలో ఈ ఏడాది పలు సంచలన కేసులు ఛేదించామని అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జట్టి తెలిపారు. 2014 ఏడాది మొత్తం జరిగిన వివిధ నేరాలకు సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలపై సోమవారం పోలీసు అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీయాక్ట్ నమోదు చేశామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టేందుకు నిత్యం అడవుల్లో కూంబింగ్ నిర్వహించామన్నారు. 2014లో 1404 మంది ఎర్రకూలీలను అరెస్టు చేశామన్నారు.

సుమారు 140 కేసుల్లో మొత్తం 65,019  కిలోల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామన్నారు. 169 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఇందులో 125 కేసులు నిరూపణ కావడంతో 76 వాహనాలను సీజ్ చేశామన్నారు. సెప్టెంబర్ 13న గాజులమండ్యం రోడ్డులో ‘సాక్షి’ ఉద్యోగిపై దాడిచేసి రూ.32,82,190 లాక్కెళ్లారని, ఆ కేసును నెల లోపే ఛేదించి 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.20,14,000 రాబట్టామన్నారు.

డిసెంబర్ 12న యూనివర్సిటీ ఏఏవో భార్య సుధారాణి హత్య ఘటనలో నిందితుడు మురళీకృష్ణను 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నామన్నారు. తిరుచానూరులో చిన్నారి లక్ష్మీప్రియను కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో నిందితుడిని కేవలం రెండుగంటల్లోనే అదుపులోకి తీసుకున్నామన్నారు. జూన్ 6వతేది బాబా పేరుతో ఎన్నో మోసాలకు పాల్పడిన శివ (అలియాస్) స్వామి, దాముకుమార్‌ను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.63,43,500 స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటితో పాటు పలు దొంగ తనం కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేశామన్నారు.
 
తాగిన వారికి మత్తు వదిలించాం
తాగి వాహనాలు నడిపే వారిపై బ్రీత్ అన్‌లైజర్‌తో తనిఖీలు చేసి 61,300 కేసులు నమోదు చేశామన్నారు. దీని ద్వారా 1,40,99,660 రూపాయల అపరాధం వేశామన్నారు. 15,036 కేసులు కోర్టుకు వెళ్లగా, అపరాధ రూపంలో 47,87,600 రూపాయలను వసూలు చేశామన్నారు. 346 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి 565 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 10,47,734 రూపాయలను సీజ్ చేశామని తెలిపారు.

2012లో 2,355 కేసులు, 2,013లో 2,475, 2014లో 3,459 కేసులు నమోదయ్యాయన్నారు. గడిచిన సంవత్సరాలతో పోల్చితే నేరాల సంఖ్య పెరిగిందన్నారు. మొత్తం ప్రాపర్టీ రూ.6,41,69,003 పోగా ఇందులో రూ.2,75,60,875 రికవరీ అయిందన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీలు త్రిమూర్తులు, సుబ్బారెడ్డి, స్వామి, డీఎస్పీ కొండారెడ్డి, సీఐలు రామ్‌కిషోర్, రామకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు