‘చంద్రబాబు.. ఇలా అయినా సంతోషించు’

9 Jul, 2020 18:15 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయడం గర్వించచదగ్గ విషయమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ అన్నారు. నగరంలో అంబేడ్కర్‌ విగ్రహం ఉంటే విజయవాడకు ఎంతో గౌరవం వస్తుందన్నారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం పెట్టడాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ తీరును ఖండిస్తున్నామన్నారు. తన హయాంలో పూర్తి చేయలేని విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తున్నందుకు చంద్రబాబు సంతోష పడాలన్నారు. విగ్రహం ఏర్పాటుకు చంద్రబాబు సహకరించాలని సూచించారు. అంబేడ్కర్‌  విగ్రహం ఏర్పాటుపై టీడీపీ రాజకీయాలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు వ్యాపార ధోరణి మీద గతంలో స్వరాజ్య మైదానం మీద కేసు వేశారని, ఇప్పుడు స్వరాజ్య మైదానం మీద కోర్టులో ఎలాంటి కేసు లేదని స్పష్టం చేశారు. (సీఎం జగన్‌ను కలిసిన మాణిక్య వరప్రసాద్‌)


అంబేడ్కర్‌ విగ్రహానికి చంద్రబాబు శంకుస్థాపన మాత్రమే చేశారని మాణిక్య వర ప్రసాద్‌ అన్నారు. చంద్రబాబు అంబేడ్కర్‌ డమ్మీ విగ్రహం ఒకటి రాజధానిలో పెట్టారని, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఎలాటి పనులు జరగలేదని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, 125 అడుగులు విగ్రహం విజయవాడ నడిబొడ్డున పెట్టాలని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంబేడ్కర్‌ ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి కాదని దేశం మెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. విజయవాడ పెద్ద టూరిస్టు సెంటర్ అవుతుందని అశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విజయవాడకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. (‘ఏడాదిలోనే విత్తన శుద్ధి కేంద్రాలు పూర్తి చేస్తాం’)

మరిన్ని వార్తలు