మాకూ వీక్లీ ఆఫ్ కావాలి...

28 Jun, 2014 04:00 IST|Sakshi
మాకూ వీక్లీ ఆఫ్ కావాలి...

- తెలంగాణ తరహాలో వారాంతపు సెలవు కోరుతున్న పోలీసులు
- ప్రతిపాదనలున్నాయి... ప్రభుత్వ నిర్ణయమే తరువాయంటున్న ఎస్పీ
శ్రీకాకుళం క్రైం:
నిత్యం నేరాలు ఘోరాలతో సావాసం... రాత్రనక పగలనక తిండి తిప్పలు లేక విధి నిర్వహణ... ప్రజాప్రతినిధుల రక్షణలో కీలక పాత్ర... ప్రజల మాన, ప్రాణ, ఆస్తుల రక్షణలో నిమగ్నం... ఇవన్నీ చెబుతున్నది ఎవరి గురించో అర్ధమయ్యేవుంటుంది.. వారే మన పోలీసులు. రోజంతా ప్రజల కోసం శ్రమిస్తారు. కాని ఆ పోలీసుల ఆరోగ్య రక్షణ, వారి కుటుంబ సరదాలను ఎవ్వరూ పట్టించుకోరు.

తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వారంలో ఒక రోజును వారాంతపు సెలవుగా ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్ర పోలీసుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే తరహాలో మన రాష్ట్ర పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ మంజూరు ేయాలన్న ఆలోచన మొదలైంది. జిల్లాలో ఎస్పీ, ఇద్దరు ఓఎస్డీలు, నలుగురు డీఎస్పీలు, 56 మంది సీఐలు, నలుగురు ఆర్‌ఐలు, 11 మంది ఆర్ ఎస్సైలు, 111 మంది ఎస్సైలు, 81 మంది ఏఎస్సైలు, 251 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 982 మంది కానిస్టేబుళ్లు, 400 మంది ఎ.ఆర్.ఎస్సైలు విధులు నిర్వర్తిస్తున్నారు.

ఏ శాఖలో పనిచేసిన వారికైనా వారాంతపు సెలవు ఉంటుంది గానీ, ఒక్క పోలీసులకు మాత్రం ఇంత వరకు ఆ భాగ్యం దక్కలేదు. దీని కారణంగా చాలా మంది పోలీసులు ఒత్తిడికి గురై అనారోగ్యానికి లోనవుతున్నారు. అంతేకాకుండా కుటుంబసభ్యులతో సరదాగా గడిపే ఆనందాన్ని కూడ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.

ఈ భావనను దూరం చేయాలంటే కచ్చితంగా వారాంతపు సెలవు కావల్సిందేనన్నది పోలీసు ఉన్నతాధికారుల భావన.ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. అయితే వారాంతపు సెలవు వల్ల విధులకు భంగం రాకుండా కొత్త నియామకాలు చేపట్టి సిబ్బందిని పెంచాల్సివుంటుంది.

మరిన్ని వార్తలు