రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రిపుల్ ఈ

24 Oct, 2013 01:18 IST|Sakshi

సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: ట్రిపుల్ ఈ  విధానం ద్వారా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ఎండీ మోహినుద్దీన్ తెలిపారు. సత్తుపల్లి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్(ట్రిపుల్ ఈ) విధానాల ద్వారా రోడ్డు ప్రమాదాలకు చెక్ పెడతామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించటం, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయటం, వాహనాల తనిఖీ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా రవాణా శాఖ రెవెన్యూ లక్ష్యాలను అధిగమిస్తున్నట్లు తెలిపారు.

రోజు రోజుకు శ్లాట్ బుకింగ్‌కు రద్దీ పెరుగుతుండంతో ఖమ్మం, కొత్తగూడెంలలో వీటి సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ఖమ్మంలో రోజుకు 48 శ్లాట్‌లు ఉండగా 90కి పెంచామని, కొత్తగూడెంలో రోజుకు 24 ఉండగా 48కి పెంచామని అన్నారు. సత్తుపల్లిలో కూడా శ్లాట్ బుకింగ్ సంఖ్య 48కి పెంచేందుకు ట్రాన్స్‌పోర్టు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. త్వరలో ఇక్కడ కూడా శ్లాట్ బుకింగ్ సంఖ్యను పెంచుతామన్నారు. రవాణా కార్యాలయాలలో టీవీ, డీవీడీలు ఏర్పాటు చేసి కార్యాలయానికి వచ్చే ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

త్రీటైర్ విధానం వచ్చినందున రవాణాశాఖా కార్యాలయాలు కార్పొరేట్ ఆఫీసులను తలపించేలా ఉండాలని.. అయితే సత్తుపల్లికి సొంత కార్యాలయం లేకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఐదు నుంచి ఆరు ఎకరాల స్థలం ఉన్నట్లైతే రవాణాశాఖ కార్యాలయానికి త్రీటైర్ విధానం అమలు చేసేందుకు, ట్రైల్స్‌ను తనిఖీ చేసేందుకు వీలు పడుతుందన్నారు. సత్తుపల్లిలో కార్యాలయం నిర్మాణానికి స్థలం కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. అనంతరం సత్తుపల్లి పాలకేంద్రం వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట సత్తుపల్లి ఎంవీఐ బి.శంకర్, ఏఎంవీఐ వరప్రసాద్ ఉన్నారు.

>
మరిన్ని వార్తలు