ధరలు భరించలేకే పంటకు ఎరువులు వేయలేకపోయాం : రైతుల ఆవేదన

1 Jul, 2013 05:11 IST|Sakshi
ధరలు భరించలేకే పంటకు ఎరువులు వేయలేకపోయాం : రైతుల ఆవేదన

 - ధరలు భరించలేకే పంటకు ఎరువులు వేయలేకపోయాం
- షర్మిల వద్ద చెరకు రైతుల ఆవేదన
- ఎరువులు వేయక, కరెంటు లేక పీలగా పెరిగిన చెరకు గెడలు
- వైఎస్ ఉన్నప్పుడే మేలు.. క్వింటాల్ చెరకుకు రూ.1,000 ఖర్చయితే
- రూ. 2,200 గిట్టుబాటు ధర ఇచ్చాడు
- ధరలు పెరిగినా ఈ ప్రభుత్వం రూ. 2,100 మాత్రమే ఇస్తోంది


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: సన్నగా, బలహీనంగా పెరిగిన చెరకు గెడలను షర్మిలకు చూపించి, ఆవేదన వ్యక్తం చేస్తున్న వీరు విశాఖ జిల్లా గోవాడ రైతులు. వీళ్లందరికీ బోర్లు ఉన్నాయి. బోర్లలో నీళ్లున్నాయి. అయితే రోజుకు 3 నుంచి 4 గంటలకు మించి రాని కరెంటుతో పోటీపడి, చెమటను నీరుగా చేసి చెరకును పెంచుకున్నారు. అయినా లాభం లేకపోయింది. తమ పొలంలో సన్నగా, పీలగా పెరిగిన ఆ చెరకు గెడలను తీసుకొచ్చి ఆదివారం పాదయాత్రలో నడుస్తూ వెళ్తున్న షర్మిలకు చూపించారు.

‘‘చెరకు గెడ ఎందుకంత సన్నగా ఉందన్నా?’’ అని షర్మిల అడిగిన ప్రశ్నకు ‘‘అమ్మా.. వచ్చీరాని కరెంటుతో పోటీ పడి పంటకు నీళ్లు పెట్టాం. కానీ ఎరువులు వేయలేకపోయాం. ఎరువులు వేసి పంట పెంచితే క్వింటాల్‌కు రూ. 2,500 ఖర్చు వస్తోంది. వైఎస్సార్ ఉన్నప్పుడు రూ. 450 ఉన్న డీఏపీ కట్టకు ఇప్పుడు రూ.1,250 అవుతోంది. రూ.400 ఉన్న కాంప్లెక్స్ ఎరువుల ధర ఈ రోజు రూ. 1,100 అయింది. పొటాష్ రూ. 750.. ఇంత ధరపెట్టి ఎరువులు కొని పంటకు వేయలేకపోయాం’’ అని రైతు దొడ్డి రాముడు చెప్పాడు. మరో రైతు బుద్ద గురునాయుడు అందుకొని ‘‘అమ్మా.. నాన్నకు చేతులెత్తి మొక్కాలే.

ఆయన ఉన్నప్పుడు క్వింటాల్ చెరకుకు రూ.1,000 ఖర్చు వస్తే రూ. 2,200 గిట్టుబాటు ధర ఇచ్చాడు. రైతులంతా అప్పుల నుంచి బయటపడ్డాం. ఇప్పుడు పెట్టుబడులు పెరిగిపోయాయి కానీ మద్దతు ధర మాత్రం పెరగలేదమ్మా. ఇప్పుడున్న ప్రభుత్వం రూ.100 తగ్గించి రూ. 2,100 మాత్రమే ఇస్తోందమ్మా’’ అని తన గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం విశాఖ జిల్లా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో సాగింది. గోవాడ జంక్షన్‌లో రైతులు ఇలా చెరకు గెడలు చూపించి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు.

ఆరు నెలలో.. ఏడాదో.. ఓపిక పట్టండి
చెరకు రైతుల సమస్యలు విన్న షర్మిల స్పందిస్తూ వారికి ధైర్యం చెప్పారు. ‘‘ఈ నాలుగేళ్ల కాలంలో వ్యవసాయంపై పెట్టుబడి ఖర్చులు చాలా పెరిగిపోయాయి. ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతం వరకు పెరిగాయి. విత్తనాల ధరలు పెరిగాయి.. రవాణా చార్జీలు పెరిగాయి. పెట్టుబడులేమో ఇంతలా పెరిగాయి. కానీ మద్దతు ధర మాత్రం పెరగలేదు. ఇలా అయితే రైతులు నష్టపోక ఏమవుతారు? ఈ అన్న చెప్తున్నాడు వైఎస్సార్ ఉన్నప్పుడు క్వింటాల్ చెరకుకు రూ. 2,200 మద్దతు ధర ఇచ్చారట. ఐదేళ్లు అవుతోంది. మద్దతు ధర పెంచాల్సింది పోయి ఈ ప్రభుత్వం ఉన్న మద్దతు ధరకు కోత పెడుతోంది. కనీసం కమిటీలు సిఫారసు చేసిన మేరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర పెంచడం లేదు.

వీళ్లకు రైతులంటే పగా? లేకుంటే చిన్న చూపా? రైతన్న నెల సగటు ఆదాయం రూ. 1,600 మాత్రమే అని అర్జున్‌సేన్ గుప్తా కమిషన్ చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లోనే అన్నం పెట్టే అన్నదాతకు మద్దతు ధర లేక నష్టాల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయి. అన్నా ఒక్క మాట మళ్లీ చెప్తున్నాను. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైతును రాజులా చూసుకుంటారు. ఏ రైతు కూడా నష్టపోకుండా తమ పంటను గిట్టుబాటు ధరకే అమ్ముకునే పరిస్థితులు వస్తాయి. రైతన్న నష్ట పోకుండా ఉండేందుకు రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ఒక్క ఆరు నెలలో, ఏడాదో ఓపిక పట్టండి’’ అని ధైర్యం చెప్పారు.

జీవం పోసుకున్న గోవాడ చక్కెర పరిశ్రమ...
పాదయాత్రలో షర్మిల గోవాడ చక్కెర పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి కార్మికులు షర్మిలతో మాట్లాడుతూ వైఎస్ గోవాడ చక్కెర పరిశ్రమను నిలబెట్టి తమను ఎలా ఆదుకున్నదీ వివరించారు. ‘‘2003 సంవత్సరంలో చిత్తూరు, శ్రీవెంకటేశ్వర, గోవాడ, నిజామాబాద్ సహకార చక్కెర మిల్లులను చంద్రబాబు నాయుడు వేలానికి పెట్టారు. గోవాడ సహకార చక్కెర పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న 10 మండలాలకు చెందిన దాదాపు 100 గ్రామాల రైతులు, కార్మికులు వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారు. అదే సమయంలో రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తూ చోడవరం వచ్చారు. ఆ సమయంలో 100 గ్రామాల ప్రజలు తరలివచ్చి వైఎస్సార్‌కు తమ సమస్యలు వివరించారు. గోవాడ చక్కెర పరిశ్రమను కాపాడాలని కోరారు. ‘‘మన ప్రభుత్వం రాగానే సహకార రంగానికి చేయూతనందించి మిల్లులను రక్షించుకుందాం’’ అని వైఎస్ మాటిచ్చారు.

ఇటు వైపు చంద్రబాబు నాయుడు గోవాడ కర్మాగారం విక్రయానికి టెండర్లు కోరుతూ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. టెండర్లు వేసే గడువు ముగిసింది.షుగర్ మిల్లును సొంతం చేసుకునేందుకు అప్పటి టీడీపీ ఎంపీ, ప్రస్తుతమంత్రి ఒకరు మిల్లును తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రైతులు కోర్టుకు వెళ్లారు. టెండర్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దొరికిన వెసులుబాటుతో రైతులు కదంతొక్కారు. నిలబడి వైఎస్సార్‌కు ఓటేసి గెలిపించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోయింది. వైఎస్సార్ ప్రభుత్వం వచ్చింది. హామీ ఇచ్చినట్లుగానే తొలి విడతలో రూ. 30 కోట్లు ఇచ్చారు. వైఎస్సార్ సహకారంతో ఊపిరి పోసుకున్న మిల్లులు ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్నాయి’’ అని వివరించారు.

14.5 కిలోమీటర్ల యాత్ర..
పాదయాత్ర 195వ రోజు ఆదివారం విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గజపతినగరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వెంకన్నపాలెం చేరింది. అక్కడి నుంచి మాడుగుల నియోజకవర్గంలోని రాయపురాజుపేట, సెమునవాడ, చౌడువాడ మీదుగా నడుచుకుంటూ షర్మిల గుల్లెపల్లి గ్రామం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. ఆదివారం మొత్తం 14 .5 కిలోమీటర్లు నడిచారు.

ఇప్పటి వరకు మొత్తం 2,593.4 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో మాజీ మంత్రి, చోడవరం సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు, మాడుగుల కోఆర్డినేటర్లు పూడి మంగపతిరావు, బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, మిలట్రీ నాయుడు, కుంభా రవిబాబు, ముదునూరి ప్రసాదరాజు, నర్సీపురం నియోజకవర్గాల కో-ఆర్డినేటర్ పెట్ల ఉమాశంకర్ గణేష్, యూత్ నాయకుడు అన్నంరెడ్డి అదీప్‌రాజు, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజూ షర్మిల వెంట యాత్రలో పాల్గొంటున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరి కృష్ణ, అందూరి రాజగోపాల్‌రెడ్డి, దవళ గిరిబాబు ఉన్నారు.

మరిన్ని వార్తలు