సస్పెండ్ చేస్తే గగ్గోలు పెడుతున్నారెందుకు?

15 Feb, 2014 14:55 IST|Sakshi
పొన్నం ప్రభాకర్

పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా గురువారం చోటు చేసుకున్న దాడిలో మొదట సీమాంధ్ర ఎంపీలే తెలంగాణ ఎంపీలు విజయశాంతి, రమేష్ రాథోడ్లపై దాడి చేశారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్లో దాడికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్లను బయట పెట్టాలని ఆయన లోక్సభ అధికారులను డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

 ఎల్లప్పుడు నోటి వెంట వచ్చే సమన్యాయం అనే పదానికి బాబు వివరణ ఇవ్వాలని బాబుకు సూచించారు. అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చిన సమయంలో సభలో చర్చించవద్దని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని గతంలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేసిన సంగతిని ఈ సందర్భంగా పొన్నం గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకున్న ఎంపీలను సస్పెండ్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఉండవల్లిని ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు

>
మరిన్ని వార్తలు