'సీఎంగా ఉన్నానో, లేదో తెలియడం లేదు'

26 Feb, 2014 15:53 IST|Sakshi
'సీఎంగా ఉన్నానో, లేదో తెలియడం లేదు'

హైదరాబాద్: దొంగచాటుగా తెలంగాణ బిల్లును ఆమోదించారని కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుజాతికి అన్యాయం చేసింది కాబట్టే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టానని వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా.. ఆపద్దర్మ సీఎంగా కొనసాగిస్తున్నారని అన్నారు. తాను సీఎంగా ఉన్నానో, లేదో తెలియడం లేదని వాపోయారు. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్లో సీమాంధ్ర విద్యార్థులతో కిరణ్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలుగు జాతికి మేలు చేసేందుకు యువతతో కలిసి పోరాటం చేస్తానన్నారు. బీఫారం ఇచ్చి సంకెళ్లు వేయాలని చూస్తే.. అది తనకు అక్కర్లేదన్నారు.  చీకటి ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని విభజిస్తే మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ప్రజలను అవమానించడమేనని చెప్పారు. ఎన్నో పార్టీలు వ్యతిరేకించినా బిల్లును ఆమోదింపజేసుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

విభజనతో సీమాంధ్ర యువత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. విభజనతో తెలంగాణకు ఎక్కువ నష్టమని తెలిపారు. విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కిరణ్ చెప్పారు. కొత్త పార్టీ ఏర్పాటుపై సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానన్నారు.

మరిన్ని వార్తలు