ఈ ఉపాధ్యాయులు మాకొద్దు

26 Jan, 2014 00:15 IST|Sakshi

పూడూరు, న్యూస్‌లైన్: పూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహోదగ్రులయ్యారు. టీచర్లను పాఠశాల నుంచి పంపించివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సంఘటన శనివారం పూడూరులో చోటుచేసుకుంది. స్థానిక సర్పంచ్ యాదమ్మ, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, విద్యార్థిని హాషంబీ తెలిపిన వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడల్లో భాగంగా ఆయా జట్లకు విద్యార్థులను ఎంపిక చేసే విషయంలో పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, విద్యార్థిని హాషంబీల మధ్య గొడవ జరిగింది.

దీంతో హాషంబీ ‘నేను క్రీడల్లో పాల్గొనబోను.. నా జట్టు విద్యార్థుల కూడా ఆడరు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘నీతో పాటు తోటి విద్యార్థులను కూడా ఆడకుండా చేస్తావా’ అంటూ పాఠశాల పీఈటీ దేవదాసు మందలించారు. ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి విద్యార్థిని హాషంబీపై చేయిచేసుకున్నారు. దీంతో హాషంబీ జరిగిన విషయాన్ని తన కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పాఠశాలకు వచ్చి విద్యార్థినిని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు గొడవ మొదలైంది.

 వీరిని సముదాయించేందుకు పాఠశాల హెచ్‌ఎం (ఎంఈఓ) రాంరెడ్డి ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. విషయం చినికిచినికి గాలివానగా మారింది. గ్రామస్తులు, విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గొడవపడుతున్నారనే సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని గొడవకు గల కారణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సముదాయించి ఆయన వెళ్లిపోయారు.

 ఆ ఇద్దరు ఉపాధ్యాయుల ప్రవర్తన మొదట్నుంచీ అభ్యంతరకరంగానే..
 జ్యోతిలక్ష్మి, దేవదాసులు పూడూరు పాఠశాలలో విధుల్లో చేరాకే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని విద్యార్థులు, గ్రామ సర్పంచ్ యాదమ్మ, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌లు పేర్కొన్నారు. అప్పటి నుంచి వారు పాఠాలు బోధించడం మానేసి కబుర్లు చెప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముందే ఒకరికొకరు పుష్పాలు ఇచ్చుకోవడం వంటివి చేసేవారంటూ మండిపడ్డారు.

ఇటువంటి చర్యలు పిల్లల ముందు చేయరాదని.. విద్యార్థులు కూడా లేనిపోనివి అలవాటు చేసుకుంటారంటూ గతంలోనే పాఠశాల హెచ్‌ఎం (ఎంఈఓ) రాంరెడ్డి, డిప్యూటి డీఈఓకు పాఠశాల ఎస్‌ఎసీ చైర్మన్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారిలో మార్పు తీసుకువస్తానని హెచ్‌ఎం నచ్చజెప్పడంతో అప్పట్లో శాంతించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు ఇలా విద్యార్థులపై దాడి చేయడం సరైంది కాదంటూ పెద్ద ఎత్తున నినదించారు. గ్రామ సర్పంచ్, పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్లకు కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారంటూ వారు మండిపడ్డారు. పాఠశాలలో ఈ ఇద్దరి ఉపాధ్యాయుల ఆగడాలను అడ్డుకోడంలో విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహించి శనివారం నేరుగా డీఈఓ సోమిరెడ్డికి ఫిర్యాదు చేశారు.

దీంతో స్పందించిన డీఈఓ పాఠశాల హెచ్‌ఎం రాంరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. జరిగిన విషయం, ఉపాధ్యాయులు జ్యోతిలక్ష్మి, దేవదాసు ప్రవర్తనపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో ఎంఈఓ పాఠశాలకు చెందిన మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు, సర్పంచ్, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్‌ల అభిప్రాయాలతో కూడిన నివేదిక తయారు చేసి డీఈఓకు పంపించారు. పూడూరు మండల కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ యాదమ్మ, పాఠశాల చైర్మన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా డీఈఓ కలిసి తమ వాదనను వినిపించి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరివెళ్లారు.

మరిన్ని వార్తలు