అధైర్యపడకండి.. అండగా ఉంటాం

29 Jun, 2014 02:13 IST|Sakshi
అధైర్యపడకండి.. అండగా ఉంటాం

- గ్యాస్ పైపులైన్ పేలుడు బాధితులకు జగన్ భరోసా                  
- నగరంలో మృతుల కుటుంబాలను ఊరడించిన వైఎస్సార్ సీపీ అధినేత
- ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శ    
- బాధలు చెప్పుకొని కన్నీరుమున్నీరైన బాధితులు
 సాక్షి ప్రతినిధి, కాకినాడ :
‘నిన్నటి దుర్ఘటనలో సర్వస్వం బుగ్గిపాలైంది. కళ్లెదుటే కుటుంబ సభ్యులు సజీవ దహనమైపోతుంటే..ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగెత్తడం తప్ప ఏమీ చేయలేకపోయాం. మమ్మల్ని మీరే ఆదుకోవాలన్నా’ అంటూ గ్యాస్ పైపులైన్ విస్ఫోటం బాధితులు, మరొక పక్క ‘ఈ బాధ భరించలేకపోతున్నా.. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు.. నిజంగా ప్రత్యక్షనరకంలా ఉందన్నా’ అంటూ ఆస్పత్రుల్లో క్షతగాత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పట్టుకొని కన్నీరు మున్నీరయ్యారు.

మృతుల కుటుంబాలను ఓదారుస్తూ..తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తూ శనివారం జిల్లాలో  జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనసాగింది. హైదరాబాద్ నుంచి విమానంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మధురపూడి చేరుకున్న జగన్ నేరుగా మామిడికుదురు మండలం నగరం చేరుకొని ఘటనాప్రాంతాన్ని పరిశీలించారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో ఏర్పడిన గొయ్యిని పరిశీలించారు. కాలిబూడిదైన పంటపొలాలు, కొబ్బరి చెట్లను పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును స్థానికులు, ప్రత్యక్షసాక్షులను అడిగి తెలుసుకున్నారు.

స్థానికులు రాయుడు జనార్దనరావు, బొలిశెట్టి భగవాన్, బండారు కాశి, రొక్కం రత్నాకర్ జగన్‌తో మాట్లాడారు. తెల్లవారుజామున పైపులైన్ జాయింట్ నుంచి గ్యాస్ లీకై దట్టమైన పొగమంచు మాదిరిగా కమ్ముకుందని, అదే సమయంలో సమీపంలోని హోటల్‌లోపొయ్యి వెలిగించడంతో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు క్షణాల్లో వ్యాపించాయని, తేరుకునే లోగానే అంతా అయిపోయిందని స్థానికులు జగన్‌కు వివరించారు. ఎవరికి వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయడం తప్ప ఏమీ చేయలేకపోయామని,  తప్పించుకోలేని వారు సజీవదహనమైపోయారని, మరికొందరు కాలిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కనీస రక్షణా చర్యలు పాటించకుండా తమ ప్రాణాలతో గెయిల్, ఓఎన్జీసీలు చెలగాటమాడుతున్నాయంటూ వారు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా ప్రాంతంలో లభ్యమవుతున్న గ్యాస్‌లో మాకు వాటా లేదు కానీ...ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యానికి మాత్రం మేము భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది’ అని వాపోయారు. ఆయిల్ కంపెనీలను ఇక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.
 
అనంతరం జగన్ గ్రామంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. మొండిగోడల మధ్యకు వెళ్లి వారిని ఓదార్చారు. ‘అసలేం జరిగింది? ఎంతమంది మృత్యువాతపడ్డారు? ఎంతమంది గాయపడ్డారు?’ అని అడిగి తెలుసుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితి, ఏ పనిచేస్తుంటారు వంటి విషయాలను కూడా ఆరా తీశారు. బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నప్పుడు జగన్ చలించిపోయారు.
 
కొండంత ధైర్యం వచ్చింది..
గటిగంటి శ్రీనివాసరావుతో పాటు అతడి కుటుంబంలోని ఐదుగురు సభ్యులు మృత్యువాత పడగా ఒంటరిగా మిగిలిన అతడి మామ చిలువూరి వెంకట్రావును జగన్ తొలుత పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడు గటిగంటి మధుకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విజయవాడ దగ్గర పెనుమలూరులో హోటల్ నిర్వహించుకుంటూ జీవనం పొందుతున్నామని, బంధువుల ఇంటికి వచ్చి తన భర్త మృత్యువాత పడ్డాడని మధు భార్య ధనలక్ష్మి విలపించింది.

ఐదేళ్ల కుమార్తె రూపిత, అత్త సత్యవతి, మామ సాంబమూర్తిలను చూసుకోవలసిన బాధ్యత తనపైనే ఉందని, ఆదుకోవాలని మొరపెట్టుకుంది.. తనకు కనీసం ప్రభుత్వ ఉద్యోగమైనా ఇప్పించాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రాన్ని అందజేసింది. మరో కుటుంబానికి చెందిన వానరాసి శ్రీరామలక్ష్మి, వానరాసి ఆదినారాయణ, నరసింహమూర్తి మృతి చెందగావారి బంధువులైన త్రిమూర్తులు, అమ్మాజీ, సుబ్బారావు, భగవాన్‌లను జగన్ పరామర్శించారు. ‘ఇళ్లన్నీ కాలిబూడిదైపోయాయి.

ఇంట్లోనే కుప్పకూలి మా వారు సజీవ దహనమయ్యారు. వచ్చి చూడమని ఎంత బ్రతిమలాడినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. మీరు ఏకంగా మా మొండి గోడల మధ్యకు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తుంటే కొండంత ధైర్యం వచ్చినట్టయ్యింది’ అని అమ్మాజీ జగన్ చేతులు పట్టుకొని కన్నీరుమున్నీరైంది. మా తరఫున అసెంబ్లీలో పోరాటం చేయాలని త్రిమూర్తులు జగన్‌ను కోరాడు.

కాలగా మిగిలిన శిథిలాలతో, మంటలను ఆర్పిన అనంతరం బురదబురదగా మారిన ఇళ్లకు జగన్ స్వయంగా వెళ్లారు. ఆ గ్రామంలో దాదాపు రెండుగంటలు ఉండి విస్ఫోటం సృష్టించిన విధ్వంసాన్ని పరిశీలించి, చలించిపోయారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్ జగన్‌ను కలిసి దుర్ఘటనకు కారకులైన గెయిల్ అధికారులపై హత్య కేసు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని కోరారు.

ఆదుకునేలా చూస్తాం
అనంతరం జగన్ అమలాపురం చేరుకుని అక్కడి కిమ్స్ ఆస్పత్రిలో, ఆ తర్వాత కాకినాడ చేరుకొని అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను  పరామర్శించారు. రోగులను పలకరించి ‘ధైర్యంగా ఉండండి.. త్వరలోనే కోలుకుంటారు.. మీకు అండగా నేను ఉంటా’నంటూ వారి నుదుటిపై చేయి వేస్తూ ధైర్యం చెప్పారు. కొంతమంది క్షతగాత్రులు జగన్‌ను చూడగానే కన్నీరుమున్నీరయ్యారు. అమలాపురం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న వానరాసి దుర్గ జగన్‌ను చూడగానే ‘కాలిన గాయాల బాధలు భరించలేకపోతున్నా.

తట్టుకోవడం నా వల్ల కావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె నుదుటిపై జగన్ చేయివేసి ‘ధైర్యంగా ఉండమ్మా’ అని చెప్పారు. మరో క్షతగాత్రురాలు రేకపల్లి సత్యవతి జగన్ రెండు చేతులు పట్టుకుని కన్నీరు పెట్టుకుంది. ‘ఏడాది కిందట నా కొడుకు ప్రమాదంలో పోయాడు. ఇప్పుడు మా కుటుంబానికి చెందిన ఆరుగురు మంటల్లో కాలిపోయి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మమ్మల్ని ఆదుకోవా’లంటూ రెండు చేతులు జోడించి వేడుకుంది. ప్రభుత్వపరంగా సహాయం అందేలా పోరాటం చేస్తామని, బాధితులకు అండగా ఉంటానని జగన్ ధైర్యం చెప్పారు.
 
మెరుగైన వైద్యసేవలు అందించండి..
కాకినాడ అపోలో, ట్రస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని జగన్ పరామర్శించారు. క్షతగాత్రులతో పాటు వారి కుటుంబ సభ్యుల కన్నీటితో జరిగిన దుర్ఘటన ను వివరించారు. తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా సహాయం అందేలా పోరాడుతూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.  

క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అపోలో ఏఓ రంజిత్‌రెడ్డి, ట్రస్ట్ ఆస్పత్రి మేనేజింగ్ డెరైక్టర్ కల్యాణ్ చక్రవర్తి, కిమ్స్ ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, సూపరింటెండెంట్ వెంకట్రావులను కోరారు. మెడికల్ రికార్డులు నమోదు చేయాలని, అంగవైకల్యం పొందితే పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అమల్లో ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జారీ చేయాలని జగన్ అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ర్ట కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చలమలశెట్టి సునీల్, బొడ్డు అనంత వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, అల్లూరు కృష్ణంరాజు, కాకినాడ, రాజమండ్రి సిటీల అధ్యక్షులు ఆర్‌వీజేఆర్ కుమార్, బొమ్మన రాజ్‌కుమార్.

కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, బొంతు రాజేశ్వరరావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాష్ర్ట సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, అనుబంధ కమిటీల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, శెట్టిబత్తుల రాజబాబు, మంతెన రవిరాజు, పంపన రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, నలమాటి లంకరాజు.

పార్టీ రాష్ర్ట యూత్, మహిళా, రైతువిభాగం కమిటీ సభ్యులు తాడి విజయభాస్కరరెడ్డి, వసుంధర, జక్కంపూడితాతాజీ, జిల్లా అధికార ప్రతినిధులు పికె రావు,కొమ్మిశెట్టి బాలకృష్ణ, పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, గుర్రం గౌతమ్, విప్పర్తి వేణుగోపాలరావు, మిండగుదిటి మోహన్, కొవ్వూరి త్రినాధరెడ్డి, ఆర్‌వి సత్యనారాయణ చౌదరి, సంగిశెట్టి అశోక్, సిరిపురపు శ్రీనివాసరావు, వట్టికూటి రాజశేఖర్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు