సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఎన్ని రోజులైనా ఉద్యమిస్తాం

14 Sep, 2013 04:15 IST|Sakshi

సాక్షి, కర్నూలు:
 సమైక్యవాదుల అడుగులతో విభజనవాదుల గుండెలదురుతున్నాయి. శుక్రవారం ఉద్యమ తీవ్రత పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. కార్యకలాపాలను స్తంభింపజేసి తాళాలు వేశారు. విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మె కొనసాగుతోంది. ఈ కారణంగా పలుచోట్ల విద్యుత్ సమస్యలు తలెత్తి ప్రజలు ఇబ్బందులకు లోనయ్యారు. రోడ్లు భవనాల శాఖ ఉద్యోగులు ఎస్‌ఈ కార్యాలయం నుంచి సి.క్యాంప్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. విశ్వేశ్వరయ్య సర్కిల్‌లో మానవహారం నిర్మించి రాస్తారోకో చేపట్టారు. అంతకుముందు స్థానిక విజ్ఞాన మందిరం ఆంధ్రాబ్యాంక్, బి.క్యాంప్ పోస్టాఫీసు, ఏపీఎస్‌ఎఫ్‌సీ, సివిల్ సప్లై కార్యాలయాలను మూయించారు.
 
  బళ్లారి చౌరస్తాలోని శ్రీరామ హనుమాన్ స్వామి దేవాలయం ఎదుట ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షలు 29వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో ఏపీ స్పెషల్ పోలీసు రెండో పటాలం రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం ఆవరణలో రిలే దీక్షలు చేపట్టిన వారికి ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. అల్లుడు అవినీతికి కొమ్ముకాస్తూ.. కుమారుడిని ప్రధానిని చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే సోనియాగాంధీ విభజనకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఆదోని    పట్టణమంతా గణేష్ నిమజ్జనోత్సవ సందడి నెలకొన్నా.. సమైక్యవాదులు ఉద్యమాన్ని ఏమాత్రం సడలనివ్వలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ అధ్యాపకులు, విద్యుత్ శాఖ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఆళ్లగడ్డలోనూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఆలూరులో మాల దాసరి కులస్తులతో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి టెలికం, ఎస్‌బీఐ, ఏపీజీబీ బ్యాంకులను మూసివేయించారు. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది.
 
  వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు దీక్షలకు మద్దతు తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో మంత్రి ఏరాసు ఇంటిని ముట్టడించారు. డోన్‌లో జ్యోతిమిత్ర మండలి ఆధ్వర్యంలో రిలే దీక్షలు మొదలయ్యాయి. ఏపీఎన్జీఓలు ర్యాలీ నిర్వహించి బ్యాంకులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను స్తంభింపజేశారు. వెల్దుర్తిలో కళాకారులు సింహగర్జన చేపట్టారు. పత్తికొండలో జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. గార్డెన్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా జలమండలి ఎదుట నీటిపారుదల శాఖ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు మంత్రి టీజీ సంఘీభావం తెలిపేందుకు వెళ్లగా ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు బుట్టా రంగయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆయనకు ఎమ్మెల్యే తనయుడు ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.

>
మరిన్ని వార్తలు