రాయల గీయల జాన్తానై

5 Dec, 2013 05:52 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై ప్రజాసంఘాలు, రాజకీయ జేఏసీ తీ వ్రంగా ధ్వజమెత్తాయి. జిల్లావ్యాప్తంగా కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్ జిల్లా శాఖ పిలుపునిచ్చిన గురువారం బంద్‌ను విజయవంతం చేయాలని ఆయాసంఘాలు మద్దతు పలికాయి.
 
 విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, థియేటర్ల యజమానులు, పెట్రోల్‌బంకులు, మార్కెట్ల యజమాన్యం బంద్‌కు సహకరించాలని టీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. జిల్లాబంద్‌కు రాజకీయ జేఏసీ, వివిధ సంఘాలు, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. విద్యార్థి, యువజన, ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, రైతు, లెక్చరర్ల సంఘాలు బంద్‌లో భాగస్వామ్యాన్ని పంచుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ సంఘాలు బస్సులు నిలిపివేయనున్నట్లు తెలిపాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవును ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ పరోక్షంగా జిల్లా బంద్‌కు సహకరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
 
 రగిలిన ఇందూరు..
 రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లాలో నిరసన ప్రదర్శనలు, ఆందోనళలు, దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు, మానవహారాలు కొనసాగాయి. నిజాంసాగర్ మండలం హాసన్‌పల్లిలో పీజీడీసీఏ విద్యార్థి మొకిరె రాములు సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని కోరుతూ సోనియాకు లేఖ రాసి ఆత్మహాత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్భంగా విద్యార్థులు, యువకులు, తెలంగాణవాదులు ధర్నా, రాస్తారోకో, నిరసన ర్యాలీ చేపట్టి, ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మృతుడు రాములు ఆత్మహత్యకు ముందు అమ్మనాన్నలకు , కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పుతూ రాసిన లేఖ తెలంగాణవాదులను తీవ్రంగా కదిలిం చింది.
 
 జిల్లాలో న్యాయవాదులు రెండోరోజు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. పలు చోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో కూడిన శవయాత్రను నిర్వహించి దహనం చేశారు. ఎల్లారెడ్డిలో మూడువేల మంది విద్యార్థులు భారీ  నిరసన ప్రదర్శన నిర్వహించారు.  పలు ప్రాంతాల్లో ర్యాలీలు, దిష్టిబొమ్మల ను దహనం చేశారు. బాన్సువాడ, కామారెడ్డిల్లో జరిగి న నిరసన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్‌రావు పాల్గొన్నారు. బాన్సువాడలో ఎమ్మెల్యే  పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డిలో ఎమ్మె ల్యే  గంపగోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి నిరసనల్లో భాగస్వాములయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ యూనివర్శిటీలో విద్యార్థులు రాయల తెలంగాణకు వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
 
 

మరిన్ని వార్తలు