రాజధానిలో భూమి ఎత్తు పెంచాలి

4 Jan, 2017 02:12 IST|Sakshi
రాజధానిలో భూమి ఎత్తు పెంచాలి

లోతట్టు ప్రాంతం ఉందని ప్రభుత్వ నివేదిక

సాక్షి, అమరావతి: నూతన రాజధాని లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు నివారణకు నిర్మాణ ప్రాంతాల్లో భూమి ఎత్తు పెంచాల్సి ఉందని సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం సామాజిక పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను సీఆర్‌డీఏ ప్రకటించింది. వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ముఖ్యంగా రవాణా కారిడార్, యుటిలిటి, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణాలకు భూమి ఎత్తు (ప్లాట్‌ఫాం) పెంచాలని నివేదికలో స్పష్టం చేసింది. కృష్ణా కరకట్టలను మరింత పటిష్టం చేయడం ద్వారా వరద ముప్పు నివారించవచ్చని పేర్కొంది.

కొండవీటివాగు వరద అంచనాలపై జలవనరులశాఖ అధ్యయనం చేస్తోందని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపింది. జలవనరులశాఖ నివేదిక వచ్చిన తరువాత చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది.  రాజధాని ప్రాంతంలో అత్యధికంగా సారవంతమైన వ్యవసాయ భూమి ఉందని, ఈ భూమిని కోల్పోవడంతో ఉపాధి లేకుండా పోయిందని సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రజలు స్పష్టం చేశారని తెలిపింది. అసైన్డ్‌ భూములకు తగిన పరిహారం చెల్లించలేదని కూడా వెల్లడించింది. ప్రజారవాణా వ్యవస్థ లేదని, మంచి నీటి సౌకర్యం లేదని, విద్య, వైద్య సౌకర్యాలు లేవని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు