టెన్త్‌ పరీక్షలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

26 Sep, 2019 18:19 IST|Sakshi

సాక్షి, అమరావతి : పదో తరగతి పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ మార్కులను రద్దు చేసింది. గురువారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘‘ పదో తరగతి పరీక్షల్లో వినూత్న మార్పులు తీసుకొస్తున్నాం. పదో తరగతి ప్రశ్న పత్రాల్లో 20 శాతం ఉన్న ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ మార్కులను తొలగించాము. గతంలో 20 మార్కులను కార్పొరేట్ కాలేజీల కోసం ఏర్పాటు చేశారు. అందుకే ఇప్పుడు రద్దు చేశాం. బిట్ పేపర్‌ని కూడా ప్రశ్న పత్రంలో అంతర్భాగం చేసేసాం. ప్రశ్న పత్రాల్లో సబ్జెక్టుల వారీగా పాస్ మార్కులు ఇస్తాం. 2.30 గంటల పరీక్షకు అదనంగా 15 నిమిషాలు ప్రశ్న పత్రం చదువుకోవడం కోసం కేటాయిస్తున్నాం.

మార్కుల షీట్‌ని కూడా నాణ్యంగా తయారుచేస్తాం. పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తాం. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించాం. 45,390 పాఠశాలల్లో  ఎన్నికలు పూర్తి చేశాం. పాఠశాలల్లో విద్యాశాఖ అమలుచేసే పథకాలపై కమిటీలకు అవగాహన కల్పిస్తాం. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల కమిటీలను భాగస్వాములను చేస్తాం. మన బడి.. మన బాధ్యత పేరుతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేపడతా’’మన్నారు.

మరిన్ని వార్తలు