భెల్‌లో ‘స్థానిక’ సమరం

17 Nov, 2013 03:43 IST|Sakshi

 రామచంద్రాపురం, న్యూస్‌లైన్:  నవరత్న అవార్డు పొందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బీహెచ్‌ఈఎల్(భెల్)లో ‘స్థానిక’ ఉద్యమం ఊపందుకుంది. భెల్‌లోని ఉద్యోగాల నియామకాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ మూడు రోజులుగా ఉద్యమిస్తున్న నిరుద్యోగులకు శనివారం ప్రజాప్రతినిధులు  కూడా మద్దతు పలికారు. టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే నం దీశ్వర్‌గౌడ్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి నిరుద్యోగ యువతకు ధైర్యం చెప్పారు. అండగా ఉండి న్యాయం జరిగేదాకా పోరాడతామన్నా రు.  అంతకుముందు ఉద్యమ కార్యాచరణలో భాగంగా స్థానిక యువకులు శనివారం భెల్ టౌన్‌షిప్‌లోని నె హ్రూ విగ్రహం నుండి భెల్ ఈడీ కార్యాలయం వరకు భా రీ ర్యాలీగా తరలివెళ్లారు.

అధికార కార్మిక సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు, భెల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం భెల్ టౌన్‌షిప్‌లోని గాం ధీ విగ్రహం వద్ద వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ, భెల్ నియామకాల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏళ్ల తరబడి వేడుకుంటున్నా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఇటీవల జరిగిన రాత పరీక్షల్లోనూ ఇతర రాష్ట్రాల వారికే ప్రాధాన్యం ఇచ్చారని వారు ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ చే పట్టాలని డిమాండ్ చేశారు. భెల్ అధికార కార్మిక సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజు భెల్ పరిశ్రమలో పనిచేస్తున్న తమిళ అధికారులకు తొత్తుగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేదాకా ఉద్యమిస్తామన్నారు.
 న్యాయం జరిగేదాకా పోరాటం: హరీష్‌రావు
 స్థానిక యువతకు మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ, ఉద్యోగ భర్తీకి ముందే తాను భెల్ యాజమాన్యంతో మాట్లాడి స్థానిక యువతకు అవకాశం కల్పించాలని కోరగా, యాజమాన్యం అందుకు హామీ ఇచ్చిందన్నారు. అయితే నియామకాల్లో మాత్రం భెల్ యాజమాన్యం తన హామీని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భెల్ ఉద్యోగాల్లో స్థానిక నిరుద్యోగులకు 80 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

యాజమాన్యం అధికారుల అండతో ఏకపక్షంగా బయటి రాష్ట్రాల వారికి ఉద్యోగ భర్తీలో పెద్దపీట వేసిందన్నారు. స్థానికులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా టీఆర్‌ఎస్ ఉంటుందన్నారు. వెంటనే స్థానిక యువతకు ఉద్యోగ భర్తీలో అవకాశం కల్పించేలా మరొక నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన సూచించారు. డిల్లీ స్థాయిలో ఒత్తిడి తెస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు.
 అండగా ఉంటాం: నందీశ్వర్ గౌడ్, భూపాల్
 ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ, భెల్‌లో ఉద్యోగ నియామకాల విషయాన్ని కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందరూ కలిసి వస్తే తాను కూడా భెల్ చైర్మన్ వద్దకు వెళ్లి చర్చించేందుకు సిద్ధమన్నారు. డిసెంబర్ నెలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందున, అంతవరకు భెల్‌లో నియామకాలను నిలిపివేయాలన్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తే తెలంగాణ పది జిల్లాలలో ఐటిఐ చదివిన నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. నిరుద్యోగ యువకులు శాంతియుతంగా ఉద్యమించాలని, యాజమాన్యం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తామూ కలిసి వస్తామన్నారు.

అనంతరం ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ, ఇక్కడ ఐటిఐ చదివి పాసైన ప్రతి ఒక్కరికీ భెల్‌లో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ ఇచ్చి మిగిలిన 20 శాతం బయటి రాష్ట్రాల వారికి ఇవ్వాలన్నారు. స్థానిక నిరుద్యోగులకు న్యాయం జరిగేంతవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, కార్పొరేటర్ పుష్పానగేష్ యాదవ్, తెల్లాపూర్ సర్పంచ్ సోమిరెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్, భెల్ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు రాజునాయక్, నాయకులు మోహన్ గౌడ్, నగేష్ యాదవ్, శంకర్ యాదవ్, రత్నం, శ్రీశైలం యాదవ్, చిలకమర్రి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 ఈడీతో భేటీ
 యువకులతో కలిసి ఆందోళన చేపట్టిన అనంతరం  టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావ్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణలు భెల్ ఈడీతో భేటీ అయ్యారు. నియామకాల్లో స్థానిక యువతకు పెద్ద పీట వేయాలని, అప్పటివరకు ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని కోరారు. అంతేకాకుండా భెల్ ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. రాత పరీక్షల అనంతరం ఇంటర్య్వూకు పిలిచినవారిలో 1,544 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉండగా, తెలుగు వారు 290 మంది మాత్రమే ఉన్నారని ఈడీ దృష్టికి తీసుకువచ్చారు.
 స్పందించిన భెల్
 యువకుల ఆందోళన, ప్రజాప్రతినిధుల మద్దతుతో భెల్ యాజమాన్యం స్పందించింది. ప్రజాప్రతినిధులు కోరినట్లుగా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేసేందుకు, ఈ విషయాన్ని ఢిల్లీలోని కార్పొరేట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఈడీ పేరిట ఓ పత్రికా ప్రకటనను వెలువరించింది.

మరిన్ని వార్తలు