గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక: కాల్వ

16 Feb, 2019 16:04 IST|Sakshi

అమరావతి: రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన టీడీపీ పోలిట్‌ బ్యూరో సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. రేపటి నుంచి ఎన్నికల సన్నాహక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఎన్నికల మేనిఫెస్టో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

వివిధ వర్గాల ప్రజలతో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశమవుతుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు వివరించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు. మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు బాధ్యతను తమ పార్టీ అధ్యక్షుడికి అప్పగించామని వెల్లడించారు. పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడంపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక అక్కడ టీడీపీ శాఖ చూసుకుంటుందని అన్నారు.

ఇదే సమావేశంలో పాల్గొన్న టీడీపీ అగ్రనేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం రేపటి నుంచి ప్రారంభించాలని భావించామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందే అభ్యర్థుల మొదటి జాబితా ఉంటుందని, ఎన్నికల ఎత్తుగడల కోసం ఒక స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ పోలిట్‌బ్యూరో సమావేశంలో ఆంధ్రా నేతలతో పాటు తెలంగాణ శాఖకు చెందిన ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు