బాధితులను ఆదుకుంటాం

28 Oct, 2013 04:29 IST|Sakshi

హాలియా, న్యూస్‌లైన్ : ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న, ఇళ్లు కూలిపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈ మంత్రులిద్దరూ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. పెద్దవూర ఎస్సీ కాలనీలో ఇళ్లు నీటమునిగిన బాధితులను పరామర్శించారు. అనంతరం తెప్పలమడుగు గ్రామం వద్ద  పెద్దవాగు వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు ను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులు.. వర్షానికి దెబ్బతిన్న పత్తి పంటను, వరిమెదలను మంత్రులకు చూపించారు. వర్షాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన రెవె న్యూ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రోడ్డు కోతకు గురికావడంతో గ్రామానికి వెళ్లేందుకు వీలు లేక వాగు వద్దే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను మంత్రి రఘువీరారెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. అనంతరం శిరసనగండ్ల గ్రామంలో కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. అక్కడి నుంచి హాలియా మండలం వెళ్లారు. మండలంలోని  అనుముల వద్ద హాలియా వాగు ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. అనంతరం నిడమనూరు మండల కేంద్రంలో గండిపడిన చెరువును పరిశీలించారు. గ్రామ పంచాయతీ వద్ద వరద ఉధృతికి దెబ్బతిన్న వంతెనను పరిశీలించారు. వెంగన్న గూడెం స్టేజీ వద్ద గ్రామస్తులు.. వర్షానికి దెబ్బతిన్న పంటలను చూపించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు.  త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో గండిపడిన చెరువును పరిశీలించారు. వీరి వెంట ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జేసీ హరిజవహర్‌లాల్, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డిలతో పాటు డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి, గుండెబోయిన రాంమూర్తి యాదవ్, అంగోతు లచ్చిరాం నాయక్,  కర్నాటి లింగారెడ్డి, చేకూరి హనుమంతరావు, అనుమలు ఏడుకొండల్, మల్గిరెడ్డి లింగారెడ్డి, రమావత్ శంకర్ నాయక్, రామలింగయ్య యాదవ్, తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి,  ఎంసీ కోటిరెడ్డి,  నారాయణ, అల్లి పెద్దిరాజు, బొలిగొర్ల చెన్నయ్యయాదవ్, మర్ల చంద్రారెడ్డి, రాంచంద్రయ్య, నరేందర్, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.

 మంత్రులకు వినతి
 మిర్యాలగూడ : ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కుందూరు జానారెడ్డిలకు ఆదివారం నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో 37 మండలాల్లోని 732 గ్రామాల్లో పంట లకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. 98161 హెక్టార్లలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా 350 హెక్టార్లలో పండ్ల తోటలు దెబ్బతిన్నట్లు చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ 10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. అదే విధంగా 5494 ఇళ్లు దెబ్బతిన్నాయని, బాధితులకు ఐఏవై(ఇందిరా ఆవాస్‌యోజన) కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారని, ఒక్కొక్క మృతుడి కుంటుంబానికి రూ 5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

మరిన్ని వార్తలు