'జీతం పెంచుతాం... సమ్మె వరమించండి'

21 Jul, 2015 22:31 IST|Sakshi

మున్సిపల్ శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీ కృష్ణ గౌడ్
జమ్మలమడుగు (వైఎస్సార్ జిల్లా) : మున్సిపాలిటీలలో అవుట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న పారిశుధ్ధ్య కార్మికులకు రూ.10,200 జీతం ఇస్తామని, వారు వెంటనే సమ్మె విరమించాలని మున్సిపల్ శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో మంగళవారం ఆయన కార్మిక సంఘం నేతలతో సమావేశమయ్యారు. అనంతపురం రీజియన్ పరిధిలో 39 మున్సిపాలిటీలు ఉండగా, తొమ్మిదింటిలో కార్మికులు సమ్మెలో పాల్గొనలేదన్నారు. ప్రస్తుతం గోదావరి పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు నిమగ్నమైనందున పారిశుద్ధ్య కార్మిక నేతలతో చర్చించే పరిస్థితి లేదన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతం రూ.10,200కు పెంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో వారు వెంటనే సమ్మె విరమించాలన్నారు.

కార్మికులు కోరుతున్నట్లు జీతం పెంచాలంటే ప్రజలపై పన్ను భారం మరింతగా మోపాల్సి ఉంటుందన్నారు. ప్రొద్దుటూరు, మదనపల్లి, చిత్తూరు, తిరుపతిలో రెగ్యులర్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడం భావ్యం కాదన్నారు. బుధవారంలోగా వారు విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, పుష్కరాల నెపం చూపి తమ సంఘం నేతలతో ప్రభుత్వం మాట్లాడక పోవడం దారుణం అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో జమ్మలమడుగు మున్సిపల్ చైర్‌పర్సన్ తాతిరెడ్డి తులసి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు