హైదరాబాద్ యూటీకి ఒప్పుకునేది లేదు

8 Sep, 2013 23:44 IST|Sakshi


 పరిగి, న్యూస్‌లైన్:
 ‘భౌగోళికంగా, సామాజికంగా.. ఇంకేవిధంగా చూసినా తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమే ... దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా (యూనియన్ టెరిటరీ)గా చేస్తామంటే ఒప్పుకునే’ ప్రసక్తే లేదని జేఏసీ, ఆయా సంఘాలు, యూనియన్ల నాయకులు తేల్చిచెప్పారు. పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం టీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెర్క సత్యయ్య అధ్యక్షతన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు - ప్రస్తుత పరిణామాలు అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జేఏసీ, ఆయా ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముందుగా సమైక్య సభ సందర్భంగా తెలంగాణ విద్యార్థులపై దాడిని, అలాగే సభలో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్‌పై దాడిని ముక్తకంఠంతో ఖండించారు.
 
  తెలంగాణ అమరవీరులకు సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఆంధ్రా ప్రాంతంలో విలీనానికి ముందు హైదరాబాద్ అంతర్భాగంగా ఉన్న 10 జిల్లాల తెలంగాణనే కోరుకుంటున్నామని వక్తలు స్పష్టం చేశారు. పిడికెడుమంది పెట్టుబడిదారులు గోబెల్స్ ప్రచారంతో సీమాంధ్ర ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారెవరినీ వెళ్లిపోవాలని ఈ ప్రాంత ప్రజలు అనడం లేదని స్పష్టం చేశారు. బలవంతంగా కలిసుందామనటం నిరంకుశత్వమనీ, తెలంగాణను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జేఏసీ ఎప్పుడు పిలుపునిచ్చినా సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ బహుజనుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వర్, విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి వెంకట్‌రాంలు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాముయాదవ్, జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆంజనేయులు, విద్యార్థి జేఏసీ నియోజకవర్గ చైర్మన్ రవికుమార్, పట్టణ అధ్యక్షుడు మునీర్, నియోజకవర్గ కో కన్వీనర్ సాయిరాంజీ, పీఆర్టీయూ, యూటీఎఫ్ తదితర సంఘాల ప్రతినిధులు చంద్రమౌళి, రామాంజనేయులు, హరిలాల్, బిచ్చయ్య, శ్రీనివాస్, చందర్, యువజన సంఘాల నాయకులు శివకుమార్, తేజకిరణ్, మోహన్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు