ఎన్నికలకు విఘాతం కల్గిస్తే కాల్పులకూ వెనుకాడం

30 Jul, 2013 05:21 IST|Sakshi

అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ శ్యాంసుందర్ పిలుపునిచ్చారు. ఎన్నికలకు విఘాతం కలిగించినా, హింసకు పాల్పడినా పోలీసు కాల్పులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎన్నికల ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు విడతల పంచాయతీ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయన్నారు. మూడో విడత కూడా ఇలాగే కొనసాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31న అనంతపురం రెవెన్యూ డివిజన్‌లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

డివిజన్‌లో 345 పంచాయతీ సర్పంచ్, 2,537 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 238 ప్రాంతాలను అతి సమస్యాత్మక, 150 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. ఈ ప్రాంతాల్లో గట్టి బందోబస్తుతో పాటు మైక్రో అబ్జర్వర్లు, వీడియో కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా పెట్టినట్లు వివరించారు. ఇప్పటికే ఉన్న పది వేల మంది పోలీసులతో పాటు చెన్నై నుంచి అదనంగా పది వేల మందితో కూడిన సీఆర్‌పీఎఫ్ బలగాలు వచ్చినట్లు వెల్లడించారు. ఓటర్లను మాత్రమే గ్రామాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఇతరులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు.

బైండోవర్ అయిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో దళితులపై అగ్రవర్ణాలు దాడులు, బెదిరింపులకు దిగుతున్నారనే ఫిర్యాదులు అందాయని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. డివిజన్‌లోని పది మేజర్ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లను నియమించామన్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరించారు. జిల్లా కేంద్రంగా బెంగళూరు, చెన్నైతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా కార్యకలాపాలు సాగిస్తోందని విలేకరుల సమావేశం అనంతరం ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందన్నారు. విచారణానంతరం ముఠా వివరాలను బహిర్గతం చేస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ విజయేందిర, డీఆర్వో హేమసాగర్, డీపీఓ రమణ, ఆర్‌డీఓ హుస్సేన్‌సాహేబ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు