వరుణ్‌ వర్సెస్‌ సూర్య

22 Jul, 2019 10:11 IST|Sakshi
అగ్రహారంలో అప్పుడే పడిన వాన.. వెంటనే వచ్చిన ఎండతో తడిపొడి రోడ్డు

నగరంలో మూడు రోజులుగా విచిత్ర పరిస్థితి

ఎండలు, వానల దోబూచులాట

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): ఇదేదో సినిమా టైటిలో, లేక ఇద్దరి మధ్య పోటీనో అనుకుంటున్నారా.. కానే కాదు.. జిల్లా కేంద్రం ఏలూరులో వాతావరణ పరిస్థితి. వేసవిని తలపించే ఎండ, కొంతసేపు మబ్బులు కమ్మడం.. మరికొంత సేపు కొద్దిపాటి చినుకులు పడడం.. ఇదీ ఇక్కడి పరిస్థితి. ఎండ, వానల దోబూచులాట వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజులుగా నగరంలో ఇదే పరిస్థితి నెలకొంది.

పోటాపోటీగా ఎండా.. వాన
వర్షాకాలం ప్రారంభమై చాలా రోజులైనా నగర ప్రజలు పట్టుమని పది చినుకులను కూడా చూసింది లేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల్లో సైతం వర్షాలు భారీగా కురుస్తున్నా నగరంలో మాత్రం గట్టి వర్షాలు కురవడం లేదు. వర్షాలు కురవకపోయినా కొన్ని ఇతర ప్రాంతాల్లో మబ్బులు కమ్మి వాతావరణం చల్లబడి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంటే నగరంలో మాత్రం వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది.

ప్రజల సహనానికి పరీక్ష
నగరంలో గత మూడు రోజులుగా అటు ఎండలు, ఇటు వానలు కురుస్తూ నగర ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఉదయం మబ్బులు పట్టి కొద్ది పాటి చినుకులు రాలడం, తరువాత కాస్త ఎండ రావడం మరి కొద్దిసేపటికి మళ్ళీ చినుకులు రాలడం ఇలా వరుణుడు, సూర్యుడు పోటీలు పడుతూ ఎటూకాని వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎండ వస్తుందిలే బట్టలు ఉతుక్కుందాం అని మొదలు పెడితే ఈ లోపు వాన కురవడంతో ఆ పనిని విరమించుకోవడం, మళ్లీ కాస్త ఎండ వస్తోంది అని బట్టలు ఉతికి ఆరవేస్తే ఈ లోపు మళ్లీ వాన రావడం, ఆరవేసిన బట్టలు తీసి ఇంటిలో వేసుకోవడం ఇదే తంతు మూడు రోజులుగా నగర ప్రజలు చేయాల్సి వస్తోంది. ఇది కాక నగరంలోని ఒక పేటలో వర్షం కురిస్తే మరొక ప్రాంతంలో ఎండగా ఉండడం, ఇక్కడ వాన పడుతోందని పక్కవీధిలోకి వెళితే అక్కడ పొడి వాతావరణం కనిపించడం వంటి పరిస్థితులు నగర ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి.

మరిన్ని వార్తలు