పగలు ఎండ.. సాయంత్రం వాన

14 May, 2018 10:22 IST|Sakshi

 జిల్లాలో మిశ్రమ వాతావరణం

తాడిమర్రిలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత

42 మండలాల్లో వర్షపాతం నమోదు

అనంతపురం అగ్రికల్చర్‌: వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుండడంతో జిల్లా వ్యాప్తంగా మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు ఉగ్రరూపం చూపుతుండగా.. సాయంత్రానికి వరుణుడు కరుణిస్తున్నాడు.  ఆదివారం తాడిమర్రిలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా రొళ్లలో 21.8 డిగ్రీల కనిష్ట ఉష్ణగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 36 నుంచి 41 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు...22 నుంచి 25 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మరికొన్ని మండలాల్లో గాలివేగం ఎక్కువగా రికార్డయింది.

పలు మండలాల్లో వర్షం
శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 42 మండలాల పరిధిలో 3.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. యాడికిలో 22.5 మి.మీ, పుట్లూరులో 18.8 మి.మీ, పెద్దవడుగూరులో 16.7 మి.మీ, శింగనమలలో 15.5 మి.మీ, గుంతకల్లులో 13.9 మి.మీ, విడపనకల్లులో 13.8 మి.మీ, బొమ్మనహాళ్‌లో 12.4 మి.మీ, డి.హీరేహాళ్‌లో 11.4 మి.మీ వర్షం కురవగా మిగతా మండలాల్లో తేలికపాటి నుంచి జల్లులు పడ్డాయి. ఇక ఆదివారం సాయంత్రం కూడా హిందూపురం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.

మరిన్ని వార్తలు