నేడు జల్లులు.. రేపు మోస్తరు వర్షాలు

18 Apr, 2019 08:44 IST|Sakshi

భారత వాతావరణ విభాగం వెల్లడి

సాక్షి, విశాఖ సిటీ: మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా గురువారం రాష్ట్రంలో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోమెరిన్‌ ప్రాంతం వరకూ కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు తెలిపింది. దీనికి ఆనుకుని కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది.

హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వివరించింది. దీని ప్రభావంతో గురువారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శుక్రవారం కోస్తాంధ్రలో  మెరుపులు, ఉరుములతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఎండలు మండుతున్నాయి
మరోవైపు.. భానుడి భగభగల కారణంగా గురువారం కొన్నిచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో వడగాలులు ప్రజల్ని భయాందోళనకు గురి చేశాయి. రాయలసీమలోనూ ఎండ మండిపోయింది. తిరుపతిలో 43, తునిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండుచోట్ల సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో 42.4, కర్నూలు, అనంతపురంలో 41.4, నంద్యాలలో 41.2, విజయవాడలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు