ఏపీలో నేటి నుంచి వానలు

20 Jun, 2019 08:50 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పక్షం రోజులు ఆలస్యంగా తొలకరి వర్షాలు ప్రారంభం కానున్నాయి. నైరుతి రుతుపవనాలు మరో 48 గంటల్లో రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. రుతుపవనాల ప్రవేశానికి ముందు మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇందులో భాగంగానే గురువారం నుంచి రాష్ట్రంలో వానలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరకోస్తాకు ఆవల ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్రమట్టానికి 3.6 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఆవరించి ఉంది. ఫలితంగా వచ్చే నాలుగు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.

అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని భారత వాతావరణ విభాగం బుధవారం వెల్లడించింది. మరోవైపు బుధవారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల సాధారణంకంటే 4–7 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కోస్తాంధ్రలో గురువారం సాధారణం కంటే 3–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కాగా రెండు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.  

>
మరిన్ని వార్తలు